చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

చమ్మక్ చంద్ర తన చిన్ననాటి పేదరికం, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడిన అపారమైన కష్టాలను పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, చదువులో వెనుకబాటు, డ్యాన్స్ క్లాసులతో జీవనం, విజయ్ గారి ఆశ్రయం, పదేళ్ల నిరీక్షణ తర్వాత జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపు ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు. తన నేటి విజయం జబర్దస్త్ వల్లేనని భావోద్వేగంగా తెలిపారు.

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..
Chammak Chandra

Updated on: Mar 31, 2026 | 5:18 PM

ప్రముఖ హాస్యనటుడు చమ్మక్ చంద్ర తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పేదరికం నుంచి జబర్దస్త్ ద్వారా వచ్చిన విజయ ప్రస్థానాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, తమది బాగా డబ్బున్న, సెటిల్ అయిన కుటుంబం కాదని, తండ్రి రైతు, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా ఉండేవారని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం తమ కుటుంబం తినడానికి కూడా ఇబ్బంది పడినంత పేదరికంలో ఉండేదని, ఇంటి నుంచి ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదని వివరించారు. తాము చాలా ఏళ్ల పాటు నూకలతో అన్నం వండుకుని తిన్నామని చెప్పారు. ఇద్దరు అవివాహితులైన తమ్ముళ్లు ఉండేవారని వివరంచారు. చంద్ర చిన్నతనంలో, వారి కుటుంబానికి రెండు బర్రెలు ఉండేవని, వాటి పాలు అమ్ముకొని జీవనం సాగించేవారని గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులు బాన్సువాడకు 12 కిలోమీటర్ల దూరం అడవిలో నుంచి సైకిల్‌ తొక్కి వచ్చి, కట్టెలు అమ్మి ఆ డబ్బులతో బియ్యం కొనుగోలు చేసేవారని, ఆ కష్టాలతోనే తనను హాస్టల్లో చదివించారని తెలిపారు. పదవ తరగతి తప్పిన తర్వాత సినీ పరిశ్రమ పట్ల ఆసక్తితో తన స్నేహితుడు గోపితో కలిసి హైదరాబాద్ వచ్చారు. మొదట రెండు మూడు నెలలు రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. అనంతరం ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో, బంధువుల వద్ద 2000 రూపాయలు అప్పు తెచ్చుకుని ‘సూపర్‌స్టార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’లో చేరారు. అక్కడ ధనరాజ్‌తో కలిసి శిక్షణ పొందారు. కోర్సు పూర్తయ్యాక రూమ్ అద్దె కట్టేందుకు, భోజనం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. డాన్స్ వచ్చినా, పరిచయాలు లేకపోవడంతో డాన్స్ క్లాసులు చెప్పడం, యాన్యువల్ డేలు చేయించడం వంటి అవకాశాలు తక్కువగా వచ్చేవని, వాటితో వచ్చే ఆదాయం ఒకట్రెండు నెలలకు మాత్రమే సరిపోయేదని ఆయన తెలిపారు.

ఈ కష్టకాలంలో, ఫిల్మ్‌నగర్‌లో నివసించే విజయ్ వద్ద రెండు సంవత్సరాలు ఆశ్రయం పొందారు. ఆయనకు వంట చేసి పెడుతూ, ఇండస్ట్రీ వాతావరణాన్ని దగ్గర నుండి చూసి అర్థం చేసుకున్నారు. విజయ్ తనను సొంత మనిషిలా చూసుకున్నారని చంద్ర కృతజ్ఞతగా చెప్పారు. ఆ తర్వాత సొంతంగా రూమ్ తీసుకుని, డాన్స్ క్లాసులు, హోమ్ క్లాసులు, యాన్యువల్ డేలు నిర్వహిస్తూ జీవనం సాగించారు. అయితే, ఈ పనులు నిరంతరం దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఆరేడు సంవత్సరాల పాటు పరిశ్రమలో కష్టాలు పడినా, మధ్యలో వదిలి వెళ్లాలనే ఆలోచన రాలేదని, తన దగ్గర చదువు లేదని, బయటకు వెళ్తే మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని ప్రారంభించాల్సి వస్తుందని నిర్ణయించుకున్నానని తెలిపారు. తనకు ఉన్న ఎంతో కొంత టాలెంట్‌పై నమ్మకంతో ఇండస్ట్రీలోనే కొనసాగాలని దృఢ నిశ్చయం చేసుకున్నారు. కేవలం 10-20 రూపాయలు ఉంటే కిలో బియ్యం తెచ్చి నాలుగు రోజులు తినేవారని గుర్తుచేసుకున్నారు. పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటం, ఎన్నో కష్టాల తర్వాత జబర్దస్త్ కార్యక్రమం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చంద్ర పేర్కొన్నారు. మొదట్లో నలుగురికి తెలిసినా చాలు అనుకున్న ఆయన, జబర్దస్త్ ద్వారా నాలుగు కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఈ రోజు తాను సాధించిన పేరు, కుటుంబానికి అందించే సంతోషం, ఆర్థిక స్థిరత్వం అన్నీ జబర్దస్త్ వల్లేనని ఆయన స్పష్టం చేశారు. తన గతానుభవాల వల్లే నేటికీ డౌన్ టు ఎర్త్ స్వభావంతో ఉంటానని, పిల్లలకు వస్తువులు కొనిచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటానని, వెయ్యి రూపాయలు సంపాదించడానికి తానెంత కష్టపడ్డానో గుర్తు చేసుకుంటూ ఉంటానని చమ్మక్ చంద్ర వెల్లడించారు.

కాగా చమ్మక్ చంద్ర ఇప్పుడు తెలుగునాట అగ్రశ్రేణి కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్ అందరిలోనూ టాప్ రెమ్యూనరేషన్ అందుకునేది ఆయనే. అంతేకాదు తన తల్లిదండ్రుల కోసం ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడు. పలు చోట్ల ప్లాట్లు, పొలం కొనుగోలు చేశాడు.

Chammak Chandra

Also Read: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..! 

 

Follow Us