
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రియాలిటీ షో ‘అలయన్స్’ ఎపిసోడ్‌లో అతిథిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ షోలో సల్మాన్ సోదరుడు నటుడు సోహైల్ ఖాన్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సోదరుడికి మద్దతుగా వేదికపైకి వచ్చిన సల్లూ , తాను జైలులో ఎదుర్కొన్న కష్టకాలం గురించి బహిరంగంగా మాట్లాడారు. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కష్టకాలాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు సల్మాన్. ‘చాలా ఏళ్ల క్రితం నేను జైలుకు వెళ్లినప్పుడు ఒక చిన్న గదిలో 50 నుంచి 60 మంది ఉండేవాళ్లం. ఒక్కటే బాత్రూమ్ ఉండేది. అందరికీ ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఒకటే ఉండేది. గదిలో ఎప్పుడు చూసినా బల్లులు కనిపించేవి. నీరు, మురుగు కూడా నిండిపోయి ఉండేది. తీవ్ర దుర్గంధం ఉండేది’ అంటూ అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నారు సల్మాన్.
1998 నాటి కృష్ణజింకల వేటకు సంబంధించిన కేసులో సల్మాన్ ఖాన్ పలు సార్లు అరెస్టు అయ్యారు. 1998లో 3 రోజులు, 2006లో 6 రోజులు, 2007లో 6 రోజులు, 2018లో 2 రోజులు.. ఇలా నాలుగు వేర్వేరు సందర్భాల్లో దాదాపు మొత్తం 18 రోజుల పాటు జైలు జీవితం గడిపారీ సూపర్ స్టార్. కాగా గతంలో పలు సందర్భాల్లో ఈ కేసు గురించి మాట్లాడారు సల్మాన్. తాను ఏ తప్పూ చేయలేదని తన మనస్సాక్షికి తెలుసని, అందుకే ప్రశాంతంగా, తల ఎత్తుకునే జైలుకి వెళ్లి వచ్చానని స్పష్టం చేశారు. కేవలం అక్కడ ఉండే అపరిశుభ్రమైన బాత్‌రూమ్‌లు తప్ప వేరే ఏ విషయానికీ తాను భయపడలేదని ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
కునాల్ ఖేము హోస్ట్ చేస్తున్న ‘అలయన్స్’ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఆగస్టు 7న జరగనుంది. ఆలీ గోని ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచారు. మినీ మాథుర్, నీతి ఫినాలే రేసులో ముందున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి