బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు మా అసోసియేషన్ షాకిచ్చింది. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. సినీ నటి హేమను సస్పెండ్ చేసే విషయమై బుధవారం మా ప్యానెల్ సమావేశం సుధీర్ఘంగా చర్చించినా ఎలాంటి నిర్ణయం ఫైనల్ కాలేదు. దీంతో హేమ సస్పెండ్ గురించి సభ్యుల అభిప్రాయాలను కోరుతూ మా అసోసియేషన్ గ్రూపులో మెసేజ్ పెట్టగా.. అధిక శాతం హేమను సస్పెండ్ చేయాలని రిప్లైస్ వచ్చాయట. దీంతో ఆమెను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు గురువారం వెల్లడించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమకు నోటీస్ పంపగా.. ఆమె స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు తెలిపారు. గత కొన్నిరోజులుగా బెంగుళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ హేమకు బెంగుళూరు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపగా.. వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్లలేదు. దీంతో మూడోసారి నోటీసులు పంపగా..బురఖా ధరించి హాజరైంది. విచారణ అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో హేమ పేరు వినిపించడంపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. రేవ్ పార్టీ విషయంలో ఆమెపై నిరాధర ఆరోపణలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తాన్నాయని.. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం.. వ్యక్తిగతంగా దూషించడం తగదని.. నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని.. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్ధోషిగానే చూడాలని.. కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే మా అసోసియేషన్ ఆమెపై చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే రేవ్ పార్టీ కేసుపై వివరణ ఇవ్వాలని కోరుతూ హేమకు నోటీసులు పంపించగా.. ఇప్పటివరకు స్పంధించకపోవడంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రేవ్ పార్టీ కేసులో హేమకు జూన్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.