
పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ తో సినిమాలు చేసేందుకు స్టార్ దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. రాకా పేరుతో తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజి బిజీగా ఉంటున్నారు బన్నీ. కాగా రాకా తర్వాత కోలీవుడ్ కే చెందిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లోనే మరో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 2026 జనవరిలోనే వచ్చింది. అయితే సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సినిమా టైటిల్, జానర్‌కు సంబంధించిన సమాచారం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఏఏ 23’ (వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు లోకేష్ కనగరాజ్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. కాగా ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందనుందని, ఈ చిత్రానికి ‘గ్యాంగ్ స్టార్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ రేంజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం బన్నీ సరికొత్తగా మేకోవర్ కానున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కూడా కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరుంది. ఖైదీ, మాస్టర్, లియో, కూలీ సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇటీవలే హీరోగానూ ఎంట్రీ ఇచ్చారీ స్టార్ డైరెక్టర్. డీసీ మూవీతో ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.