
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో భారీ సినిమా రాబోతుండటం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2016లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా పదేళ్ల గ్యాప్ తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ జతకట్టబోతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే, ఈసారి వీరు రొటీన్ మాస్ మసాలా చిత్రాన్ని కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో ఓ భారీ పౌరాణిక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన అల్లు అర్జున్, ఇప్పటివరకు పూర్తిస్థాయి పౌరాణిక చిత్రంలో నటించలేదు. బోయపాటి శ్రీను తయారుచేసిన ఒక పవర్ ఫుల్ మైథలాజికల్ స్క్రిప్ట్, అందులోని సరికొత్త కోణం బన్నీని విపరీతంగా ఆకట్టుకున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కథ విన్న వెంటనే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ ఓ పౌరాణిక సినిమా చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, చివరకు ఆ అవకాశం బోయపాటిని వరించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. గతంలో ‘సరైనోడు’ సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ విజువల్ వండర్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ అనే హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రంతో బన్నీ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మరో తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ భారీ సినిమా చేయనున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీనుతో చేయబోయే ఈ పౌరాణిక చిత్రం పట్టాలెక్కనుంది.ఇండియన్ సినీ పరిశ్రమలో మైథలాజికల్ కథలకు ఆదరణ వెల్లువెత్తుతున్న తరుణంలో, బన్నీ-బోయపాటి కాంబినేషన్ ఈ జానర్‌ను ఎంచుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి