
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నటి రమాప్రభ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. తన మనసులో ఉన్న విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలోనూ ముందుంటారు. గతంలో దివంగత నటి సౌందర్య గురించి రమాప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. రమాప్రభ మాటల్లో సౌందర్య కేవలం ఓ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఎంతో ప్రత్యేకమైన మనిషి. సాధారణంగా కొంతమంది వ్యక్తులకు పెట్టిన పేరుకు, వారి ప్రవర్తనకు పొంతన ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ సౌందర్య విషయంలో మాత్రం ఆమె పేరు అక్షరాలా సార్థకమైందని ప్రశంసించారు. అందం, నటన, మంచితనం, ప్రేమతత్వం, ఆడతనం.. ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఆమెలో సమపాళ్లలో ఉన్నాయని రమాప్రభ చెప్పుకొచ్చారు.
స్టార్ హీరోయిన్‌గా అగ్రస్థానానికి చేరుకున్నప్పటికీ సౌందర్యలో ఏమాత్రం గర్వం కనిపించేది కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సెట్స్‌లో కూడా చాలా ప్రశాంతంగా ఉండేవారని, ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుకుంటూ తన లోకంలో తాను ఉండేవారని తెలిపారు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారని రమాప్రభ తెలిపారు.. సౌందర్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సందర్భాన్ని కూడా రమాప్రభ గుర్తు చేసుకున్నారు. ఖరీదైన కాస్మోటిక్స్ కోసం ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదని, అందం కోసం ఇంటి చిట్కాలనే ఎక్కువగా నమ్మేవారని తెలిపారు.
అంతేకాదు.. కెరీర్ ప్రారంభ దశలో సౌందర్య స్రవంతి గెస్ట్ హౌస్ లో ఉండేవారని రమాప్రభ పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత కూడా అక్కడే ఉండేవారని, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లకు వెళ్లే అలవాటు ఆమెకు లేదని చెప్పారు. సౌందర్య మరణం తర్వాత ఆమె నివసించిన గదికి సౌందర్య రూమ్ అని పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు. సౌందర్య నటనపై తనకున్న అభిమానాన్ని చెబుతూ అంతఃపురం సినిమాను 60, 70సార్లు చూశానని రమాప్రభ అన్నారు. ప్రతి సారి సినిమా చూసినప్పుడు ఆమె నటన కొత్తగా అనిపించేదని తెలిపారు. సౌందర్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా తనకు ఎంతో నచ్చేదని చెప్పారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Heroine Soundarya
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.