Ankitha: ఆ టాలీవుడ్ హీరో, హీరోయిన్లే నా బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడూ ఇద్దరూ ప్రాణాలతో లేరు.. అంకిత ఎమోషనల్
తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అంకిత పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటుంది. అలా ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో అంకిత ఒకరు. సూపర్ హిట్ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆడియెన్స్ కు చేరువైంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. ధనలక్ష్మీ ఐ లవ్ యూ, రారాజు, మనసు మాట వినదు, విజయేంద్రవర్మ, ప్రేమలో పావని కళ్యాణ్ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించంది అంకిత. అయితే ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఎన్టీఆర్ నటించిన సింహద్రి అని చెప్పవచ్చు. ఇందులో అంకిత చాలా క్యూట్ గా కనిపించింది. యాక్టింగ్ పరంగానూ ఆకట్టుకుంది. అన్నిటికీ మించి ‘చీమ చీమ చీమ చీమ’ అంటూ సాగే సాంగ్‌లో ఎన్టీఆర్‌కు పోటీగా డ్యాన్స్ చేసింది అందాల తార. తెలుగుతో పాటు తమిళం, కన్నడం సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అయితే తన సినిమా కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన అంకిత స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. 2009 వరకు వరుస సినిమాలు చేసిన అంకిత ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిసారిగా పోలీస్ అధికారి చిత్రంలో నటించింది.ఇక 2016లో విశాల్ జగతాప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలోని న్యూజెర్సీలో సెటిలైపోయిందీ అందాల తార. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న అంకిత ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.
‘ సినిమా ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్. మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు మనతో లేరని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. మా సిస్టర్ పెళ్లికి కూడా ఆర్తి అగర్వాల్ వచ్చింది. తను సినిమాలు మానేశాక అమెరికాలోనే ఉండేది. అక్కడ మేము రెగ్యులర్ గా కలుసుకునేవాళ్లం. ఇక హీరో ఉదయ్ కిరణ్ నేను కలిసి ఒక సినిమా కూడా చేయాల్సింది కానీ.. ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. మేం ముగ్గురం హైదరాబాద్ వస్తే తప్పకుండా కలిసేవాళ్లం అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది అంకిత. ప్రస్తుతం అంకిత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




