
స్టార్ నటుడు అర్జున్ తన చిన్న కూతురు అంజనా పెళ్లిని గ్రాండ్ గా జరిపారు. అక్టోబర్ లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు అర్జున్ సర్జా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే, పెద్ద కూతురు నటి ఐశ్వర్య, ఆమె భర్త నటుడు ఉమాపతి రామయ్య ఈ పెళ్లికి హాజరు కాలేదు. దీంతో ఐశ్వర్య వివాహంపై ఒక్కసారిగా లేని పోని రూమర్లు వ్యాపించాయి. కొందరు ఆమె వ్యక్తిగత అలవాట్లపై కూడా అవమానకరమైన రీతిలో కథనాలు అల్లారు. దీంతో ఐశ్వర్య తండ్రి , నటుడు అర్జున్ ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తన కూతురు వైవాహిక జీవితంపై వస్తోన్న రూమర్లను ఖండిస్తూ ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. ‘ముందుగా నా చిన్న కూతురు అంజనా పెళ్లికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అయితే ఈ వివాహం జరిగిన సమయంలోన నా పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ నేను ఆమె వ్యక్తిగత విషయాలపై స్పందించకుండా, గోప్యతని గౌరవిస్తూ మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి మహిళ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను సొంతంగా తీసుకునే హక్కు కలిగి ఉంది. ఐశ్వర్య కూడా తనకు అనిపించినప్పుడు తానే అన్నీ విషయాలని వెల్లడిస్తుంది. కానీ తండ్రిగా నా కూతురు వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు, అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేను’
‘ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై విమర్శలు, పుకార్లు సహజమే. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళపై ఆరోపణలు చేయడం, ఆమెని మద్యపానానికి బానిసగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. మౌనం గౌరవప్రదమైన స్పందన మాత్రమే. అలా అనీ దానిని అంగీకారంగా భావించకూడదు. తప్పుడు ప్రచారం పదేపదే చేయడాన్ని సహించలేం. జర్నలిజం, వార్తా రిపోర్టింగ్ వృత్తులపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలను పట్టించుకోకుండా కేవలం సంచలనాల కోసం వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయం కేవలం నా కూతురికి సంబంధించినది మాత్రమే కాదు. సమాజంలో ప్రతి మహిళ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఫ్యామిలీ సపోర్ట్ లేని మహిళలకు ఇలాంటి ఆరోపణలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.ఇకపై ఇలాంటి నిరాధార, పరువునష్టం కలిగించే ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గౌరవం, ఆత్మాభిమానం విషయంలో రాజీ ఉండదు’ అని రాసుకొచ్చారు అర్జున్. ప్రస్తుతం ఈ నోట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కొన్ని రోజుల క్రితం, ఉమాపతి తండ్రి, నటుడు తంబి రామయ్య, విడాకుల వార్త కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. వారిద్దరూ చెన్నైలోని తమ నివాసంలో సంతోషంగా కలిసి ఉన్నారని ఆయన చెప్పారు. ఐశ్వర్య, ఉమాపతిలకు 2024 జూన్లో చెన్నైలో వివాహం జరిగింది. కానీ ఇప్పుడు, వారిద్దరూ పెళ్లిలో కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.