ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ సందడి చేశారు. ఇప్పుడు వీరు ముగ్గురు పెళ్లికి రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ పెట్టిన ఇన్ స్టా స్టోరీ తెగ వైరలవుతుంది. తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫన్నీ రీల్ షేర్ చేశాడు. అందులో తన ఏజ్ వాళ్లంతా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటే .. తాను మాత్రం జిమ్ లో ఇలా ఐదు కేజీల డంబెల్ ఎత్తుకుని వర్కౌట్లు చేస్తున్నాను అన్నట్లు ఓ రీల్ పంచుకున్నాడు . తన జీవితం కూడా అలాగే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం అతను చేసిన వీడియో స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్‌గా సినీ అరంగేట్రం చేశాడు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలతో అలరించాడు. సినీ కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేకపోయాడు. కానీ నటన పరంగా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంటూనే ఉన్నాడు శిరీష్.
శిరీష్ చివరగా ఊర్వశివో రాక్షసివో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఈ సినిమాకు యూత్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటాడు శిరీష్. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్, పర్సనల్ విషయాలను నెట్టింట షేర్ చేసుకుంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.