RGV : ఆ ఒక్క పాట మనిషి జీవితాన్నే మారుస్తుంది.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్ ఇదే.. విన్నాకొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది..
జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు మనిషికి కొండంత ధైర్యాన్ని ఇచ్చి, బతుకుపై సరికొత్త భరోసా కల్పించే ఒక అద్భుతమైన సాంగ్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పాటగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఆ పాటలోని ప్రతి పదం మనిషి ఆలోచనా విధానాన్నే మార్చేస్తుందని ఆయన పేర్కొనడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు చిత్రాలు తగ్గించిన ఆయన.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆర్జీవీ చెప్పే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ఒక పాత తెలుగు సినిమా పాటపై ప్రశంసల వర్షం కురిపించారు. జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు మనిషికి కొండంత ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైన పాట ఒకటి ఉందని, ప్రపంచంలోని అన్ని పాటల కంటే అదే గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ వర్మ మనసును అంతగా హత్తుకున్న ఆ పాట మరేదో కాదు.. హీరో సుమన్ నటించిన ‘పట్టుదల’ చిత్రంలోని “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే స్ఫూర్తిదాయక పాట. ఈ పాటలోని ప్రతి పదం మనిషి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. జీవితం, దాని తత్వం, ప్రాధాన్యత గురించి ఈ పాట మూడున్నర నిమిషాల నిడివిలో సమగ్రంగా వివరిస్తుందని ఆర్‌జీవీ అన్నారు. జీవితంలోని అన్ని కోణాలను కవర్ చేస్తూ, దాని అర్థాన్ని ఇంత లోతుగా వివరించిన పాటను తాను ఇంతకు ముందు వినలేదని ఆయన తెలిపారు. ఈ పాట సాహిత్యం ఎంత గొప్పదో వివరించడానికి ఆయన కొన్ని లిరిక్స్ సైతం గుర్తు చేసుకున్నారు.
“ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమీ.. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం” అనే సాహిత్యం ఓటమిని అంగీకరించకుండా నిరంతరం పోరాడాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. “నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా.. సంద్రం ఎంత గొప్పదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా” వంటి చరణాలు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని వర్మ వివరించారు. జీవితం అంటేనే నిత్య ఘర్షణ అని, అడుగు అడుగునా పోరాడి గెలిచినప్పుడే ఆ క్షణం మనదవుతుందని ఈ పాట బోధిస్తుందని వర్మ తెలిపారు. “ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారధౌనురా” అనే మాటలు తన వ్యక్తిగత జీవన తత్వానికి ఎంతో దగ్గరగా ఉంటాయని ఆయన చెప్పారు.
జీవితంలో అంతిమ గెలుపు అనేది ఉండదని, ఎందుకంటే మనం ఎప్పటికైనా మరణిస్తామని ఆర్‌జీవీ తన తత్వాన్ని పంచుకున్నారు. మన కథనం ఎప్పటికైనా ముగుస్తుందని, కాబట్టి మన జీవితం అనేది మనం చేస్తున్న ప్రయాణంలోనే ఉంటుందని ఆయన వివరించారు. ఈ లోతైన తత్వజ్ఞానం, సమగ్రమైన దృక్పథం వలనే సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాట తనకు ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా అనిపించిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్ ఇదే..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
