Seetha Payanam Movie Review : సీతా పయనం మూవీ రివ్యూ.. యాక్షన్ కింగ్ మార్క్ ఎమోషనల్ జర్నీ..!
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అర్జున్ సర్జా.. ఈసారి మెగాఫోన్ పట్టి తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రేమ, బంధాలు, విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీతా పయనం ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ జర్నీ ఆడియన్స్‌కి ఎలాంటి ఫీల్ ఇచ్చింది? అర్జున్ తన డైరెక్షన్‌తో మ్యాజిక్ చేశారా? అనేది రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: సీతా పయనం
నటీనటులు: ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, సిరి హనుమంతు, అర్జున్ సర్జా, ధృవ్ సర్జా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: అయూబ్ ఖాన్
సినిమాటోగ్రఫీ: బాలమురుగన్
దర్శకత్వం & నిర్మాణం: అర్జున్ సర్జా
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అర్జున్ సర్జా.. ఈసారి మెగాఫోన్ పట్టి తన కుమార్తె ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రేమ, బంధాలు, విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీతా పయనం ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ జర్నీ ఆడియన్స్‌కి ఎలాంటి ఫీల్ ఇచ్చింది? అర్జున్ తన డైరెక్షన్‌తో మ్యాజిక్ చేశారా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
వైజాగ్‌లో ఉండే సీత (ఐశ్వర్య అర్జున్)కు తన తండ్రి (సత్య రాజ్) అంటే పంచప్రాణాలు. పెళ్లి అనే మాటే ఇష్టపడని సీత, ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా తప్పించుకు తిరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో ఒక ప్రాజెక్ట్ పని మీద ఆమె హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఆ ప్రయాణమే ఆమె జీవితాన్ని ఎలా మార్చింది..? దారిలో పరిచయమైన అభి (నిరంజన్) ఆమె అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేశాడు..? ఇక వీళ్ళిద్దరి కథలోకి గిరి (అర్జున్), బసవన్న (ధృవ్ సర్జా) పాత్రల ఎంట్రీ ఎలాంటి మలుపులు తిప్పింది? మధ్యలో అభి తాతగారు (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏంటి.. అనేది తెరపై చూడాల్సిందే.
కథనం:
కూతురి ఎంట్రీ కోసం అర్జున్ ఎంచుకున్న కథ ఇది. అందుకే ఇందులో కమర్షియల్ హంగుల కంటే, ఎమోషన్స్‌కే ఎక్కువ పెద్దపీట వేశారు. సీత పాత్రను ప్రధానంగా చేసుకుని కథను ముందుకు తీసుకెళ్లాడు. కేవలం గ్లామర్ డాల్‌లా కాకుండా, భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా డిజైన్ చేశారు. లైన్ పాతదే అయినా.. దాన్ని డీల్ చేసిన విధానం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న హిందూ ధర్మ రక్షణ, గోసంరక్షణ, దేశభక్తి లాంటి అంశాల చుట్టూ కథ అల్లుకున్నాడు. వీటి చుట్టూ నడిచే డ్రామా ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. మూగజీవాల పట్ల ప్రేమను, మానవ విలువలను అర్జున్ చాలా బలంగా చెప్పారు. అయితే కొన్ని సన్నివేశాల్లో సినిమా మరీ క్లాస్ పీకినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు అనిపించడం కాస్త ఇబ్బంది పెడుతుంది. మాస్ ఇమేజ్ ఉన్న అర్జున్, ఇంతటి స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామాను డీల్ చేయడం అభినందనీయం. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా చూపించడం.. వాటికి సరైన నటులు ఉండటంతో సీన్స్ బాగానే ఎలివేట్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా రోడ్ జర్నీలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొదటి అర్థభాగంలో ప్రశ్నలు వేసి.. సెకండాఫ్‌లో ఆ చిక్కులన్నీ విప్పుకుంటూ వెళ్లిపోయాడు దర్శకుడు అర్జున్. ఈ క్రమంలోనే సెకండాఫ్‌లో కొంచెం సాగదీతగా మారింది. అక్కడక్కడా మరీ ఎక్కువైన ఉపదేశాలు సినిమాపై సాగదీసిన ఫీలింగ్ తీసుకొచ్చాయి. క్లైమాక్స్ కూడా కాస్త త్వరగా ముగించి ఉంటే బాగుండేది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే సీతా పయనం తీసుకొచ్చింది.
నటీనటులు:
తెలుగులో మొదటి సినిమానే అయినా ఐశ్వర్య అర్జున్ చాలా మెచ్యూర్డ్‌గా నటించింది. ఆమెలో ఒక డివైన్ లుక్ కనిపిస్తుంది. మోడరన్ అమ్మాయిగా కాకుండా, పద్ధతి గల పాత్రలో ఆమె ఒదిగిపోయారు. హీరోగా నిరంజన్ తన పరిధి మేరకు రాణించాడు. సీనియర్ నటులు సత్యరాజ్, ప్రకాష్ రాజ్ సినిమాకు పిల్లర్స్‌లా నిలిచారు. తండ్రీకూతుళ్ళ మధ్య వచ్చే సీన్స్‌లో సత్యరాజ్ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక అర్జున్, ధృవ్ సర్జాల క్యామియోలు బాగున్నాయి. బిత్తిరి సత్తి కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. సిరి హనుమంతు తన పాత్ర వరకు నటించింది.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు ప్రధాన బలం అనూప్ రూబెన్స్ సంగీతం. పాటలు వినసొంపుగా ఉన్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. కెమెరా వర్క్ చాలా ప్లెజెంట్‌గా ఉంది, వైజాగ్ లొకేషన్లను అందంగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. దర్శకుడిగా అర్జున్ సర్జా తనదైన యాక్షన్ జోనర్ కాకుండా ఫ్యామిలీ జోనర్ తీసుకున్నాడు. కాస్త నెమ్మదిగానే చెప్పినా.. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా సీతా పయనం.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
