AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memu Copulam Review: ‘మేం కాప్‌లం’ వెబ్ సిరీస్ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను కలిసి మ్యాజిక్ చేశారా..?

మెగా బ్రదర్ నాగబాబు, జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రల్లో డిఫరెంట్ ప్రమోషన్స్‌తో వచ్చిన వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. ప్రముఖ ఓటీటీలో రూరల్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

Memu Copulam Review: ‘మేం కాప్‌లం’ వెబ్ సిరీస్ రివ్యూ.. నాగబాబు, గెటప్ శ్రీను కలిసి మ్యాజిక్ చేశారా..?
Memu Copulam Web Series Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 23, 2026 | 5:28 PM

Share

సిరీస్ రివ్యూ: మేం కాప్‌లం

నటీనటులు : నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరీటి దామరాజు తదితరులు..

సంగీతం : సాకేత్ కోమండూరి

సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిడపు

ఎడిటింగ్ : మైఖేల్ డి సిల్వా

దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి

నిర్మాత : బి.వి.ఎస్ రవి, కౌముది

కథ:

మహాదేవ పట్టణం అనే పల్లెటూరిలో గజపతి రాజు (నాగబాబు) అందరి మన్ననలు పొందే ఊరి పెద్ద. ఆయన ప్రాణంగా పెంచుకునే పందెం కోడి పేరు ‘సలార్ రాజు’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఊరి ప్రజలకు ఇచ్చిన విందు తర్వాత ఆ కోడి అనూహ్యంగా అదృశ్యమవుతుంది. గజపతి రాజు పందెం కోడిని వెతికి పట్టుకునే బాధ్యతను ఆ ఊరి ఎస్ఐ రవి (రవితేజ నన్నిమాల), కానిస్టేబుల్ మోహన్ (గెటప్ శ్రీను) భుజాన వేసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊరిలో వరుసగా కొందరు వింత రోగాల బారిన పడి, రక్తపు వాంతులు చేసుకుంటూ ఆసుపత్రుల పాలవుతుంటారు. అసలు గజపతి రాజు కోడిని ఎవరు దొంగిలించారు? ఊరి జనాలు రోగాల బారిన పడటానికి గల కారణం ఏంటి? ఈ గ్రామంలో సాగుతున్న చీకటి దందా ఏమిటి? ఈ మిస్టరీని పోలీసులైన రవి, మోహన్ ఎలా ఛేదించారు? అన్నదే ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.

కథనం:

ఒక పందెం కోడి చుట్టూ అల్లుకున్న క్రైమ్ అండ్ కామెడీ పాయింట్ వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఎంచుకున్న ఈ కోర్ పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని ఆరు ఎపిసోడ్ల పాటు ఆసక్తికరంగా నడపడంలో స్క్రీన్‌ప్లే కాస్త తడబడింది. మొదటి భాగంలో విలేజ్ పాలిటిక్స్, పల్లెటూరి వాతావరణం, అమాయకపు పోలీసుల నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కనెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో చేతబడి వ్యవహారాలు, ఊరి జనాలు వింత వ్యాధిన పడటం లాంటి అంశాలతో కథనంలో క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ చిన్న పాయింట్‌ను మరీ ఎక్కువ ఎపిసోడ్లు చేయడంతో నరేషన్ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. నిడివి తక్కువగానే ఉండటం ఈ సిరీస్‌కు ప్రధానంగా కలిసొచ్చే విషయం. ఎపిసోడ్స్ అన్నీ అరగంటకు అటూ ఇటూగా ఉంటాయి. క్రైమ్ మిస్టరీ అని ప్రమోట్ చేసినప్పటికీ, అందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో పేలలేదు. కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కవుట్ అయినా, మరికొన్ని చోట్ల కాస్త ఇరికించినట్లు అనిపిస్తుంది. అక్కడికీ గెటప్ శ్రీను, రవితేజ కలిసి చాలా వరకు మ్యాజిక్ చేశారు. ఇక సబ్ ప్లాట్స్‌గా వచ్చే లవ్ ట్రాక్, రిపోర్టర్ ఎపిసోడ్స్ పర్లేదు. కథలో బలమైన విలనిజం లేకపోవడం ఒక లోపం కాగా.. క్లైమాక్స్ ట్విస్టులు, సస్పెన్స్ రివీల్ అయ్యే విధానం జస్ట్ ఓకే అనిపిస్తుంది.. ఎలాంటి లాజిక్కులు, మ్యాజిక్కులు వెతక్కుండా చూస్తే ఎంటర్‌టైన్మెంట్ కోసం ఈ ‘మేం కాప్‌లం’ సిరీస్ పర్లేదు అనిపిస్తుంది. 6 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ సాగుతుంది.

నటీనటులు:

ఈ వెబ్ సిరీస్‌కి ప్రధాన ఆకర్షణ లీడ్ రోల్స్ చేసిన గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల. ఏమీ తెలియని, ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే అమాయకపు పోలీసుల పాత్రల్లో వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. నాగబాబు ఊరి పెద్ద గజపతి రాజుగా తన అనుభవాన్ని తెరపై చూపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సిరీస్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. మిగతా కీలక పాత్రల్లో నటించిన సిరి పార్వతి, కిరీటి దామరాజు, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు తదితరులు తమ క్యారెక్టర్ల పరిధి మేర చక్కగా నటించి మెప్పించారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు సాకేత్ కోమండూరి అందించిన నేపథ్య సంగీతం కొన్ని కామెడీ సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేసింది. ఆర్ఆర్ పర్లేదు.. ఇక కెమెరామెన్ పనితనం బాగుంది. పల్లెటూరి అందాలను, నేటివిటీని తెరపై చాలా సహజంగా ఆవిష్కరించారు. ఎడిటర్ మాత్రం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ల్యాగ్ అనిపించే సాగదీత సీన్లను ట్రిమ్ చేసి ఉంటే అవుట్‌పుట్ మరింత క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా బాగున్నాయి. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మంచి పాయింట్ తీసుకున్నాడు.. కామెడీ-క్రైమ్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేశాడు.. కానీ ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉండుంటే సిరీస్ రేంజ్ పెరిగేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘మేం కాప్‌లం’.. రూరల్ విలేజ్ కామెడీ డ్రామా.. అంచనాలు లేకుండా చూస్తే అలరిస్తుంది..!

Follow Us