
మలయాళ చిత్రపరిశ్రమ మాలీవుడ్‌లో మదనకామరాజులు చెలరేగిపోతున్నారు. సినిమా అవకాశాల కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులు అక్కడ సర్వసాధారణమైపోయాయి. ఇలాంటివి వాటికి సర్దుకుపోయి, రాజీపడితేనే మాలీవుడ్‌లో మహిళలకు మనుగడ సాధ్యం.. లేదంటే వాళ్ల సినిమా జీవితానికి ఇక ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. సర్దుకుపోయేవారికి సెపరేట్ కోడ్ నేమ్స్, తిరగబడిన వారిపై అప్రకటిత నిషేధం ఖాయం. ఇవన్నీ మాలీవుడ్‌లో మదనకామరాజుల బాగోతంపై వెలుగు చూసిన జస్టిస్ హేమ కమిషన్ నివేదికలోని కీలక విషయాలు. మలయాళ చిత్ర పరిశ్రమను ఇప్పుడీ సంచలన నివేదిక వణికిస్తోంది. ఈ నివేదిక చదువుతూ పోతే సామాన్యులు తల్లడిల్లాల్సిందే. అనేక సంచలన విషయాలు అందులో ఉన్నాయి. మలయాళ చిత్రసీమలో మహిళలు తీవ్ర లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఈ కమిషన్ నివేదిక తేల్చింది. ఈ నివేదిక మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే కాదు.. భారత ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం నేపథ్యంలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. ఇప్పుడు ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. నివేదికలోని అంశాలు మలయాళ చిత్రపరిశ్రమను షేక్ చేస్తోంది. 295 పేజీల సుదీర్ఘ నివేదికలో జస్టిస్ హేమ కమిటీ అనేక విషయాలు ప్రస్తావించింది. మహిళలపై లైంగిక వేధింపులు, శ్రమదోపిడి, అసభ్య ప్రవర్తన...