ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో చిరంజీవి, బాబు మోహన్, బ్రహ్మానందం మధ్య డేట్ల సమస్య తలెత్తిన్నట్లు సీనియర్ నటుడు బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి స్వయంగా చొరవ తీసుకుని సాయంత్రం 4-6 గంటల షూటింగ్ సమయాన్ని సూచించారని అన్నారు. ప్రస్తుతం బాబూ మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

టాలీవుడ్ నటుడు బాబు మోహన్, మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధం, వృత్తిపరమైన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఠామేస్త్రి చిత్రం షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న ఒక సంఘటనను ఆయన ప్రధానంగా వివరించారు. ఈ సంఘటన చిరంజీవి వృత్తి నైపుణ్యాన్ని, ఆయన నిరాడంబరతను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని బాబు మోహన్ తెలిపారు. ముఠామేస్త్రి సినిమా కోసం చిత్రీకరించాల్సిన ఒక కీలకమైన సన్నివేశంలో చిరంజీవి, బాబు మోహన్, బ్రహ్మానందం ముగ్గురూ కలిసి నటించాల్సి ఉంది. అయితే, మూడు నెలల పాటు వారి డేట్లు కుదరకపోవడంతో ఆ సన్నివేశం చిత్రీకరణ నిలిచిపోయింది. బాబు మోహన్ డేట్లు కుదిరితే, బ్రహ్మానందంవి కుదిరేవి కావు, బ్రహ్మానందంవి కుదిరితే బాబు మోహన్వి కుదిరేవి కావు. ఈ పరిస్థితి వల్ల సినిమా విడుదల తేదీకి అడ్డంకి ఏర్పడుతుందేమోనని చిత్ర బృందం ఆందోళన చెందింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి చిరంజీవి స్వయంగా చొరవ తీసుకున్నారు. ఒక రోజు ఆయన బాబు మోహన్‌ను, బ్రహ్మానందంను పిలిచి, “ఈ సన్నివేశం పూర్తి చేయాలి. విడుదల తేదీ దగ్గర పడుతోంది. మీ డేట్లు కుదరడం లేదు. ఎప్పుడు చేద్దాం?” అని ప్రశ్నించారు. దీనికి బాబు మోహన్, బ్రహ్మానందం ఒకరి తర్వాత ఒకరు సాకులు చెప్పడంతో చిరంజీవి కొంత అసహనానికి గురయ్యారు. చివరకు, “సరే, ఫలానా రోజు ఏ టైం ఇస్తారో చెప్పండి. లంచ్ టైమా? సాయంత్రమా? 9 గంటలా? 10 గంటలా? 4 నుండి 6 గంటలా?” అని కోపంగా అడిగారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి 4-6 గంటల వంటి అసాధారణ సమయంలో షూటింగ్ చేయడానికి అంగీకరించడం బాబు మోహన్‌ను, బ్రహ్మానందాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా, అగ్ర తారలు ఉదయం పూట లేదా పూర్తి రోజు కాల్ షీట్లు ఇస్తారు తప్ప, సాయంత్రం రెండు గంటల స్లాట్‌లో షూటింగ్ చేయడం అరుదు. అయినప్పటికీ, చిరంజీవి తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బాబు మోహన్ ఆ రోజు నాలుగు ఇతర షూటింగ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, చిరంజీవి సూచించిన సమయానికి షూటింగ్ కోసం సిద్ధమయ్యారు. ఆయన, బ్రహ్మానందం ఇద్దరూ “చిరంజీవి గారు 4-6 గంటల మధ్య షూటింగ్‌కు వస్తారా?” అని అనుమానపడ్డారు. వారు షూటింగ్ సెట్‌కు కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నారు. సారధి స్టూడియోలోకి అడుగుపెట్టగానే, చిరంజీవి అప్పటికే చెట్టు కింద కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉండటం చూసి బాబు మోహన్, బ్రహ్మానందం షాకయ్యారు. “అయ్యో! మనకంటే ముందే వచ్చిన్రో, కొంప మునిగింది” అని బాబు మోహన్ భావించారు. వారిని చూసి నవ్వుతూ, చిరంజీవి, “ఏంటి బాబు మోహన్? ఏంటి, అలా సర్ప్రైజ్ అవుతున్నారు? నేను రాననుకున్నారు కదరా?” అని అడిగారు. దీనికి బాబు మోహన్ “అవునన్నా, మీరు రారేమో కార్లో పడుకుందాం అని ఊహించుకుని వస్తున్నామన్నా” అని సమాధానం ఇచ్చారు. చిరంజీవి పెద్దగా నవ్వి, “నేను సమయం అంటే కొంచెం సిన్సియర్ గా ఉంటా బాబు మోహన్” అని అన్నారు. చిరంజీవి చెప్పిన మాటలకు తాను ఆశ్చర్యపోయానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!
