పుస్తెల తాడుతో పవిత్ర బంధాన్ని అతం చేసిన భార్య.. ఎలాగంటే..

| Edited By: Srikar T

Mar 25, 2024 | 3:52 PM

జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో అయినవారినే అడ్డు తొలగించుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అంతమొందించింది ఓ భార్య.

పుస్తెల తాడుతో పవిత్ర బంధాన్ని అతం చేసిన భార్య.. ఎలాగంటే..
Wife Kills Her Husband
Follow us on

జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో అయినవారినే అడ్డు తొలగించుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అంతమొందించింది ఓ భార్య. చివరికి కిరాయి గూండాలకు భర్త కట్టిన పుస్తెలతాడును సుపారిగా ఇచ్చి భర్తను హతమార్చింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెరకు చెందిన వనం ఈశ్వర్‌(35)కు సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన నవ్యతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప (4), బాబు(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ కూడా జరిగింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న వైన్ షాపులో పని చేసే కట్టంగూర్ మండలం అంబటివాగుకు చెందిన సతీశ్‌‎తో నవ్యకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వివాహేతర సంబంధం గురించి తెలిసిన భర్త ఈశ్వర్ భార్య నవ్యతో గొడవ పడుతుండేవాడు. ఇలాంటి పనులు మానుకోవాలంటూ కొడుతుండేవాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య నవ్య, ప్రియుడు సతీష్ భావించారు.

సుపారి కోసం పుస్తెలతాడు..

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన నక్క వీరాస్వామి లారీ డ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. సతీష్‎కు వీరస్వామి దూరపు బంధువు. నవ్యతో తనకు ఉన్న వివాహేత సంబంధానికి అడ్డుగా ఉన్న ఈశ్వర్‎ను హత్య చేయాలని కోరాడు. తనకు తెలిసిన వారితో కలిసి ఈశ్వర్‎ను హత్య చేసేందుకు వీరస్వామి రెండు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. సుపారి విషయాన్ని నవ్యకు చెప్పడంతో తన మెడలో భర్త కట్టిన రెండు తులాల బంగారు పుస్తెలతాడును తీసి సతీష్‎కు ఇచ్చింది.

మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెంకు చెందిన ధనవత్ హనుమ నాయక్, త్రిపురారం మండలం బడాయిగడ్డ తండాకు చెందిన ధనవత్ సాయిలను వీరస్వామి సంప్రదించి ఈశ్వర్‎ను హత్య చేసేందుకు రూ.40 వేలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందరూ కలిసి ఈశ్వర్‎ను హత్య చేసేందుకు పథకం వేశారు. ఈనెల 16న ఈశ్వర్, భార్యా పిల్లలతో కలిసి కట్టంగూర్ నుండి టేకుమట్లకు బైక్‎పై వెళ్తున్నాడు. నకిరేకల్ దాటిన తర్వాత ఈశ్వర్ బైక్ చెడిపోవడంతో భార్యాపిల్లలను ఆటో ఎక్కించి టేకుమట్లకు పంపించాడు. అప్పటికే ఈశ్వర్‎ను వీరస్వామి హనుమాన్ నాయక్, సాయిలు వెంబడిస్తున్నారు. బైక్ రిపేర్‎లో సహాయం చేసే సాకుతో వీరస్వామి అక్కడికి వెళ్లాడు. మాటలు కలిపి పరిచయం చేసుకొని ఈశ్వర్ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి నకిరేకల్‎లో మద్యం తాగారు.

పథకంలో భాగంగా ఈ నెల 17న వీరస్వామి సూర్యాపేటలో కారు అద్దెకు తీసుకుని కట్టంగూరు వచ్చాడు. ఈశ్వర్‎ను నల్గొండకు వెళ్దామని నమ్మించి కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే నల్లగొండ బస్టాండ్‎లో వెయిట్ చేసున్న హనుమ నాయక్, సాయిలను కూడా కారులో ఎక్కించుకుని కట్టంగూర్ వైపు వెళ్లారు. మార్గ మధ్యలో దండంపల్లి గ్రామ శివారులో.. కారు వెనుక సీటులో కూర్చున్న హనుమాన్ నాయక్, సాయిలు కారు ముందు సీటులో కూర్చున్న ఈశ్వర్ మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఓ వ్యవసాయ బావిలో పడేశారు. హత్య అనంతరం వీరస్వామి, హనుమాన్ నాయక్, సాయిలకు రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రూ. 95 వేల నగదును సతీష్‎కు ఇచ్చాడు. బావిలో గుర్తు తెలియని మృతదేహం లభించడం, ఈశ్వర్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తిప్పర్తి పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు భార్య నవ్య భర్త కట్టిన పుస్తెలతాడునే సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు చెబుతున్నారు. భార్య నవ్య ప్రియుడు సతీష్, హనుమానాయక్, సాయిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రెండు తులాల బంగారు పుస్తెలతాడు, రెండు బైక్ లు, ఐదు ఫోన్లు, రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పి కె శివరాం రెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..