టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. నాలుగేళ్ల క్రితం సిట్ విచారణ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు సీన్‌లోకి ఈడీ రంగప్రవేశం అంతకుమించి హీట్ పుట్టిస్తోంది. ఈటీ నోటీసులు దేనికి సంకేతం? అసలు డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ అంటే.. అంతకుమించి మ్యాటర్ ఉందనేది క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. నిజానికి డ్రగ్ పెడ్లర్లంతా విదేశీయులే. గోవా, హైదరాబాద్ కేంద్రంగా వాళ్లు డ్రగ్స్ దందా చేశారు. ఇక్కడ విక్రయాలు జరుపుతూ పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారు. ఆ మొత్తం నగదును వేర్వేరు రూపాల్లో సొంత దేశానికి తరలించారన్నది ఈడీ అనుమానంగా కనిపిస్తోంది. అందుకే నోటీసులు, విచారణతో మొత్తం కూపీ లాగాలని చూస్తోందని అర్థమవుతోంది.
విదేశాల నుంచి ఎల్‌ఎస్టీ, కొకైన్, హెరాయిన్ లాంటి డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. ఒక్క గ్రాము కొకైన్ విలువ దాదాపు పది వేల రూపాయలు. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్‌కు షికాగో అంతర్జాతీయ మత్తుమందుల ముఠాతో సంబంధాలు ఉన్నాయి. డార్క్ వెబ్‌తో డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చి ఇంటర్నెట్ ద్వారా చెల్లింపులు జరిపినట్టు తెలుస్తోంది. కొరియర్‌లో అమెరికా, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికాల నుంచి దిగుమతి చేసుకుంటూ.. 3 ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పాటు పోస్టల్ శాఖ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్టు సమాచారం. చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలో జరిగాయని తెలుస్తోంది.
ఇంతకీ బిట్ కాయిన్ అంటే ఏంటీ..
కరెన్సీకి ఎలా ప్రత్యామ్నాయంగా మార్చుకుంటున్నారు. బిట్ కాయిన్ ఇది ఒక్కటి ఉంటే చాలు.. లక్షాధికారే. ఓ పది ఉంటే.. కోటీశ్వరుడి కిందే లెక్క. దాని విలువ అలాంటిది. భారత కరెన్సీలో ఒక్క బిట్‌కాయిన్ ప్రస్తుత విలువ.. 34లక్షల 81వేల 636 రూపాయల 57 పైసలు.
బిట్ కాయిన్ అనేది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా తయారు చేయలేదు. ఇదొక వర్చువల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా పిలుస్తారు. బిట్ కాయిన్ లావాదేవీలు అత్యంత గోప్యంగా జరిగిపోతాయి. ఎవరు ఎవరికి బిట్ కాయిన్లను పంపుతున్నారో మూడో వ్యక్తికి ఆ వివరాలు తెలియవు. మనకు బిట్ కాయిన్లను పంపే అవతలి వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయి.
అలాగే మనం ఎవరికైనా బిట్ కాయిన్లను పంపితే మన వివరాలు అవతలి వారికి తెలియవు. బిట్ కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఆధీనంలో ఉండవు. దీని లావాదేవీలపై వినియోగదారులకు ఎలాంటి ట్యాక్సులు విధించలేరు. అందుకే బిట్ కాయిన్‌కు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది.
వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్‌కు ఎలాంటి పూచీ, హామీ ఉండదు. బిట్ కాయిన్ కొనేవాళ్లు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమిది. ఇది వాస్తవంగా మనం వాడే కరెన్సీ కాదు. అందుకే ప్రపంచంలో ఉన్న ఏ దేశ చట్టమూ, ప్రభుత్వమూ ఈ బిట్ కాయిన్‌కు పూచీగా ఉండదు.. హామీ కూడా ఇవ్వలేదు. సాధారణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ విషయానికొచ్చేసరికి ప్రభుత్వాలు బాధ్యత వహించవు.
బిట్ కాయిన్ల లావాదేవీలకు ప్రత్యేకంగా ఎక్స్‌ఛేంజ్ సంస్థలు ఉన్నాయి. వీటిని కొన్నప్పుడు, లేదా వీటిని వాస్తవ కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు కొంత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మన దగ్గర ఉన్న బిట్ కాయిన్లను అవతలి వారికి పంపాలన్నా.. లేదంటే వారి దగ్గరున్న బిట్ కాయిన్లను మనం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ పబ్లిక్ కీ ఉపయోగపడుతుంది.
ప్రైవేట్ కీ ఉన్న ఇద్దరు యూజర్లు తమ పబ్లిక్ కీ ల ద్వారా బిట్ కాయిన్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక ఈ పబ్లిక్ కీ మొత్తం కనిష్టంగా 30కి పైన, గరిష్టంగా 130కి లోపు క్యారెక్టర్లను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా 1, 5 లేదంటే 9 నంబర్‌తో ప్రారంభమవుతుంది. అలాగే ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. ఇవి మొత్తం వేర్వేరు అక్షరాలు, లెటర్లు, సింబల్స్ కాంబినేషన్ రూపంలో ఎన్‌క్రిప్ట్ అయి ఉంటాయి. పూచీకత్తుగా… పబ్లిక్ లెడ్జర్ వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్‌కు ఏ దేశమూ, ప్రభుత్వమూ పూచీ ఉండదు కానీ.. పబ్లిక్ లెడ్జర్ అనేది పూచికత్తుగా వ్యవహరిస్తుంది.
భౌతిక కాయిన్‌లను ఉపయోగించి ఇంటర్నెట్‌లో వర్చువల్ బిట్ కాయిన్లను సొమ్ము చేసుకోవచ్చు. ఇప్పటికే కాస్ట్లీయస్ బిట్ కాయిన్లను భౌతిక రూపంలో విక్రయిస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్, బ్రాస్ కోటింగ్‌లు ఉన్నవి దొరుకుతున్నాయి. ఆయా కోటింగ్‌లను బట్టి ఈ కాయిన్ల విలువలు ఉంటాయి.
ఈ బిట్ కాయిన్ల రూపంలోనే డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారనే అనుమానాలు ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగిందని గట్టిగా భావిస్తున్న ఈడీ ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని భావిస్తోంది.
ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి