మెహందీ కూడా మెషీన్‌తోనే.. ‘ఇంకొన్ని ఉద్యోగాలు పోయినట్టే’.. హర్ష్ గోయెంకా పోస్ట్ వైరల్‌

AIతో మెహందీ వేసే మెషీన్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా Xలో షేర్ చేస్తూ ‘Some more jobs gone’ అని వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా మెహందీ కళాకారులు చేసే పనిని యంత్రం చేయడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆటోమేషన్‌ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేయగా, చేతితో వేసే మెహందీలోని మానవ స్పర్శను యంత్రాలు భర్తీ చేయలేవని మరికొందరు అభిప్రాయపడ్డారు..

మెహందీ కూడా మెషీన్‌తోనే.. ‘ఇంకొన్ని ఉద్యోగాలు పోయినట్టే’.. హర్ష్ గోయెంకా పోస్ట్ వైరల్‌
AI Mehendi Machine Goes Viral

Updated on: Sep 11, 2026 | 10:10 AM

టెక్నాలజీ అభివృద్ధితో మనుషులు చేసే ఎన్నో పనులను యంత్రాలు సులభంగా చేసేస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఎన్నో ఉద్యోగాలు యంత్రాల చేతిలోకి వెళ్లిపోయాయి. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ AI వీడియో సోషల్‌ మీడియాలో మరో చర్చకు దారితీసింది. మహిళల చేతులకు మెహందీ వేసే ఓ మెషీన్‌ను ఈ వీడియోలో కనిపించింది. సంప్రదాయంగా మెహందీ కళాకారులు చేసే పనిని కూడా ఓ యంత్రం చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. హర్ష్ గోయెంకా తన X ఖాతాలో పోస్టు చేసిన ఈ AI-generated వీడియోలో ఓ మహిళ తన చేతిని ప్రత్యేకంగా రూపొందించిన మెషీన్‌ వద్ద ఉంచగా.. ఆమె చేతిపై అందమైన మెహందీ డిజైన్‌ను మెషిన్‌ వేస్తుంది. ఈ వీడియోలో మనుషుల ప్రమేయం చాలా తక్కువగా కనిపిస్తుంది.

మెహందీ కళాకారుల పరిస్థితి ఏంటి?

ఈ వీడియోను షేర్ చేస్తూ హర్ష్ గోయెంకా ‘Some more jobs gone’ అంటూ క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆటోమేషన్‌ వల్ల సంప్రదాయంగా మనుషులు చేస్తున్న పనులపై భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో మెహందీ వేసే కళాకారులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇది కేవలం ఒక పని మాత్రమే కాకుండా నైపుణ్యంతో కూడిన కళ. అయితే మెషీన్‌తో వేగంగా, ఒకే రకమైన ఖచ్చితత్వంతో మెహందీ డిజైన్లు వేయగలిగితే ఈ రంగంలో పనిచేసే వారి ఉపాధిపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి టెక్నాలజీ వల్ల సమయం ఆదా కావడంతో పాటు మెహందీ డిజైన్లు మరింత వేగంగా, కచ్చితంగా వేయడం సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆటోమేషన్‌ కేవలం ఫ్యాక్టరీలు, పారిశ్రామిక రంగాలకే పరిమితం కాకుండా రోజువారీ సేవల్లోకి కూడా ప్రవేశిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలామంది మాత్రం సంప్రదాయ మెహందీ కళాకారులు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి


ముఖ్యంగా పెళ్లికి ముందు ఇలాంటి సూది లాంటి మెషీన్‌లో చేతిని పెట్టడానికి మహిళలు భయపడతారని, అందువల్ల మెహందీ కళాకారుల ఉద్యోగాలకు పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. మరో వ్యక్తి చేతితో వేసే మెహందీలో ఉండే అందం, సహజమైన చిన్న చిన్న లోపాలను రోబోటిక్‌ డిజైన్లు భర్తీ చేయలేవని అభిప్రాయపడ్డారు. మానవ స్పర్శ, చేతి పనిలోని సున్నితమైన నైపుణ్యం ప్రత్యేకమైనవని చెప్పారు. అయితే మరికొందరు మాత్రం ఆటోమేషన్‌ ఉద్యోగాలను పూర్తిగా తొలగించడమే కాకుండా కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించగలదని పేర్కొన్నారు. మెషీన్‌లో మానవ స్పర్శ లేకపోవచ్చు కానీ ఇలాంటి యంత్రాలను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయడం కోసం ఎంతో ఇంజినీరింగ్‌ నైపుణ్యం అవసరమవుతుందని మరో యూజర్‌ అన్నారు. ఈ టెక్నాలజీ కారణంగా కొత్త రకాల ఉద్యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us