Best career options after 12th: ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు తీసుకోవలనే సందేహాలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్ తర్వాత ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నా.. కోర్సు ఎంపిక చేసుకోవడంలో తికమక పడిపోతుంటారు. విద్యార్థి ఏ రంగంలో ఉన్నత విద్య చేయాలో నిర్చయమైతే.. అభిరుచిని బట్టి ఆయా కోర్సుల్ని ఎంచుకొని కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో కోర్సుల వివరాలు, ఇంటర్ తర్వాత ఉన్నత విద్య కోర్సుల కోసం ఏయే ప్రవేశపరీక్షలు అందుబాటులో ఉంటాయో? ఆ వివరాలు మీకోసం..
ఇంటర్ తర్వాత ఎన్నో మార్గాలు..
ఇంజనీరింగ్ కెరీర్: ఎంపీసీ చదివిన విద్యార్ధుల్లో అధికశాతం ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అందుకు ప్రతి ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
జేఈఈ
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశలుగా ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశ కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కూడా రాసిన విద్యార్ధులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంసెట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంసెట్ పరీక్షను ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ కల్పిస్తారు.
బిట్‌శాట్: దీని ద్వారా ప్రముఖ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. అలాగే వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్‌లు కల్పిస్తున్నాయి.
ఇవేకాకుండా.. Ecet, Aueet, Vitee, Srmjeee, MET, AEEE,LPUNEST, GAT, SITEEE, KLEEE, KIITEE, PESSAT వంటి ప్రవేశ పరీక్షలు రాయవచ్చు.
బీఎస్సీ
ఎంపీసీలో ఉత్తీర్ణుత సాధించిన విద్యార్ధులు డిగ్రీ స్థాయిలో బీఎస్సీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. బీఎస్సీ కోర్సులోనూ వివిధ స్పెషలైజేషన్లు ఉంటాయి.
ఉద్యోగావకాశాలు: ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివిన విద్యార్ధులకు.. యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ (ఎస్‌సీఆర్‌ఏ), ఇండియన్ ఆర్మీ నిర్వహించే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు.. అనేక స్టేట్ లెవల్ ఉద్యోగాలకు అర్హులే.
బైపీసీ
మెడికల్ ఫీల్డ్‌లో సెటిల్ అవ్వాలనుకునే విద్యార్ధులు NEET ప్రవేశ పరీక్ష రాయవల్సి ఉంటుంది. వైద్యులుగానేకాకుండా.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ, డైరీ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి మరెన్నో కోర్సులు కూడా ఉన్నాయి. బీఎస్సీతోపాటు, బీజడ్‌సీతోపాటు బయోకెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సులు కూడా డిగ్రీ స్థాయిలో చదవవచ్చు.
ఫార్మసీ కోర్సులు
పీసీ ఉత్తీర్ణులైన విద్యార్ధులకు బీఫార్మసీ, ఫార్మా-డీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే మూడు స్థాయిల కోర్సులు చేయవచ్చు. బీఫార్మసీ, ఫార్మా-డీకి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
మెడికల్ కోర్సులు
మెడికల్ ఫీల్డ్‌లో రాయదగిన వివిధ ప్రవేశ పరీక్షలు
Eamcet, ICAR AIEEA, CLAT,Lawcet, LSAT INDIA, AILET, DEECET, NIFT, NCHMM
హెచ్‌ఈసీ విద్యార్ధులకు కెరీర్ అవకాశాలు
హెచ్‌ఈసీ విద్యార్థులు సాధారణంగా డిగ్రీ స్థాయిలో బీఏను ఎంచుకుంటారు. హెచ్‌ఈసీ పూర్తి చేసినవారు సివిల్ సర్వీసెస్, రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్, వీఆర్‌వో/వీఆర్‌ఏ వరకూ అన్ని పోటీ పరీక్షలు రాయవచ్చు. హెచ్‌ఈసీ విద్యార్థులు సంప్రదాయ బీఏ కోర్సుకు ప్రత్యామ్నాయంగా బీఏ-ఎల్‌ఎల్‌బీ కూడా చేయవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సులో అడుగుపెట్టొచ్చు. కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ‘లా’ కోర్సులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా వంటి తదితర కొత్త సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. లా పూర్తి చేసిన అభ్యర్థులు కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవచ్చు.
సీఈసీ
సాధారణంగా సీఈసీ విద్యార్ధులు డిగ్రీ స్థాయిలో బీకాం కోర్సును ఎంచుకుంటారు. డిగ్రీతోపాటు సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేయొచ్చు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ.. సీఈసీ విద్యార్థులు ఎంచుకోదగిన మూడు ముఖ్యమైన ప్రొఫెషనల్ కోర్సులు.
ఇంటర్ అర్హతతో రాయదగిన పోటీ పరీక్షలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్, తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులు, పారా మిలిటరీ పోస్టులు (జాతీయ స్థాయిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఇండో-టిబెటిన్ బోర్డర్ ఫోర్స్ తదితర పారా మిలిటరీ విభాగాల్లోనూ కానిస్టేబుల్ ఉద్యోగాలు), రాష్ట్ర స్థాయిలో అన్నిరకాల గ్రూప్-4 ఉద్యోగాలు పొందవచ్చు. డీఈడీతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సుల్లో చేరవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.