UPSC సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? సక్సెస్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఇదే
UPSC 123 Ranker Tarun Teja Success Tips: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కి యేటా లక్షలాది మంది పోటీపడుతున్న.. ఇందులో నెగ్గడం ఏ కొందరికో సాధ్యం అవుతుంది. పరీక్షలో విజయాన్ని సాధించిన టాపర్ తరుణ్ తేజ తన ప్రిపరేషన్ విధానం, టైమ్ మేనేజ్‌మెంట్, నోట్స్ తయారీ, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వంటి కీలక అంశాలను వివరించారు. UPSCలో మంచి ర్యాంక్ సాధించడానికి యువత ఏమేం చేయాలో సూచించారు..

హైదరాబాద్, మే 29: ఎంతో కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 పరీక్షలో విజయాన్ని సాధించిన ఓరుగల్లు వాసి తరుణ్ తేజ తన ప్రిపరేషన్ విధానం గురించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. కష్టపడటమే కాదు.. సరైన ప్లానింగ్, క్రమశిక్షణ, నిరంతర ప్రాక్టీస్ ఉంటే UPSCలో మంచి ర్యాంక్ సాధించవచ్చని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తరుణ్ తేజ తన ప్రిపరేషన్ విధానం గురించి వివరించారు. ఏం చెప్పారంటే..
UPSC ప్రిపరేషన్‌లో మొదట బేసిక్స్ బలంగా ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు. అందుకే ప్రారంభంలో NCERT పుస్తకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పారు. ముఖ్యంగా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ వంటి సబ్జెక్టులను కాన్సెప్ట్‌లతో అర్థం చేసుకుంటూ చదివినట్లు వివరించారు. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్‌తో పాటు ప్రతిరోజూ న్యూస్‌పేపర్ చదివే అలవాటు పెంచుకున్నారని చెప్పారు. కరెంట్ అఫైర్స్‌పై మంచి పట్టు ఉండటం UPSCలో చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేసుకుని రెగ్యులర్‌గా రివైజ్ చేసినట్లు తెలిపారు.
తరుణ్ తేజ చెప్పిన మరో ముఖ్యమైన విషయం టైమ్ మేనేజ్‌మెంట్. రోజుకు ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. ఎంత ఫోకస్‌తో చదివామన్నదే ముఖ్యమని చెప్పారు. ప్రతిరోజూ ఒక స్టడీ ప్లాన్ రూపొందించుకుని దానిని కచ్చితంగా ఫాలో అయ్యేవారని తెలిపారు. మెయిన్స్ పరీక్ష కోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రతిరోజూ ప్రశ్నలకు సమాధానాలు రాయడం వల్ల స్పీడ్, ప్రెజెంటేషన్, విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతాయని వివరించారు. ప్రిలిమ్స్ కోసం మాక్ టెస్టులు ఎక్కువగా రాసినట్లు, తప్పులను విశ్లేషించి మళ్లీ అవే తప్పులు చేయకుండా చూసుకున్నట్లు చెప్పారు. UPSC ప్రిపరేషన్‌లో రివిజన్ చాలా కీలకమని, చదివినదాన్ని పలుమార్లు తిరిగి చదవాల్సిందేనని సూచించారు.
అంతేకాకుండా ప్రిపరేషన్ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరమని తరుణ్ తేజ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మద్దతు, సానుకూల ఆలోచనలు, సెల్ఫ్ మోటివేషన్ తన విజయానికి ప్రధాన కారణాలని చెప్పారు. Consistency ఉంటే UPSC కచ్చితంగా క్రాక్ చేయవచ్చని తరుణ్ తేజ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




