ఇంటర్‌ ఫస్టియర్‌ సిలబస్‌లో మార్పులు.. పరీక్షల విధానంలోనూ కొత్త రూల్స్‌!

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త పరీక్షా విధానం అమల్లోకి రానుంది. ఫస్టియర్‌ సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ (ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌) ప్రవేశపెట్టారు. పరీక్షల విధానం, మార్కుల కేటాయింపు తదితర అంశాలపై..

ఇంటర్‌ ఫస్టియర్‌ సిలబస్‌లో మార్పులు.. పరీక్షల విధానంలోనూ కొత్త రూల్స్‌!
TS Inter 1st Year Syllabus changed

Updated on: Oct 03, 2026 | 10:14 AM

హైదరాబాద్‌, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త పరీక్షా విధానం అమల్లోకి రానుంది. ఫస్టియర్‌ సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు అన్ని సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ (ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌) ప్రవేశపెట్టారు. పరీక్షల విధానం, మార్కుల కేటాయింపు తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. సబ్జెక్టుల వారీగా రాత పరీక్ష, ప్రాక్టికల్స్‌కు కేటాయించే మార్కులు, ఇతర వివరాలను తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాత పరీక్షకు 80.. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు

కొత్త విధానంలో ప్రతి సబ్జెక్టుకు 80 శాతం మార్కులు రాత పరీక్షకు, 20 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌/ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌కు కేటాయించనున్నారు. ఈ విధానాన్ని బోర్డు గతంలోనే ప్రకటించింది. రాత పరీక్షలో మొత్తం 80 మార్కులకు కనీసం 28 మార్కులు సాధించాలి. అంటే 35 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రాక్టికల్స్‌లో 20 మార్కులకు కనీసం 7 మార్కులు సాధించాలి. ఈ రెండు విభాగాల్లోనూ నిర్దేశించిన కనీస మార్కులు సాధించినప్పుడే విద్యార్థి ఉత్తీర్ణుడైనట్లు పరిగణిస్తారు. సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్‌ విధానంలోనూ మార్పులు చేశారు. గతంలో సైన్స్‌ సబ్జెక్టులకు సెకండియర్‌లోనే ప్రాక్టికల్స్‌ ఉండేవి. అయితే 2026-27 నుంచి ఫస్టియర్‌, సెకండియర్‌లో ప్రాక్టికల్స్‌ను విభజించారు. ఫస్టియర్‌లో సగం, సెకండియర్‌లో మిగిలిన సగం ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లిష్‌లోనూ మార్పులు..

ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఫస్టియర్‌లో ఒకే పాఠ్య పుస్తకం అందుబాటులో ఉంటుంది. సెకండియర్‌లో పాఠ్య పుస్తకంతో పాటు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ మాన్యువల్‌ కూడా ఉంటుంది. కొత్త సిలబస్‌, పరీక్షల విధానం, మార్కుల కేటాయింపు తదితర అంశాలపై కళాశాలల ప్రిన్సిపల్స్‌ విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సూచించారు. విద్యార్థులు కూడా పరీక్షలకు ముందే కొత్త విధానాన్ని పూర్తిగా తెలుసుకుని, రాత పరీక్షతో పాటు ప్రాక్టికల్స్‌పై సమానంగా దృష్టి పెట్టాలని బోర్డు సూచించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us