Hindi Medium Controversy: ‘దేశ విద్యాసంస్థల్లో హిందీ మీడియం తప్పనిసరి చేస్తే యువతకు తీరని నష్టం’

|

Oct 12, 2022 | 4:30 PM

కేరళ, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా విద్యాసంస్థల్లో హిందీ మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ..

Hindi Medium Controversy: దేశ విద్యాసంస్థల్లో హిందీ మీడియం తప్పనిసరి చేస్తే యువతకు తీరని నష్టం
KTR and Keral CM Opposes Hindi medium Proposal
Follow us on

దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలో మాత్రమే బోధన ఉండాలన్న హోంమంత్రి అమిత్ షా సారద్యంలోని పార్లమెంటరీ కమిటీ అన్ అఫీషియల్ లాంగ్వేజెస్ నివేదికను తప్పుపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా హిందీ భాషలోనే నిర్వహించడంపై ప్రధాని మోడీకి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్రం నిర్ణయంపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి.

హిందీ మీడియం తప్పనిసరి అంటున్న కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్‌

దేశ ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దే ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. ఐఐటీ, ఎన్.ఐ.టీ లాంటి ప్రపంచస్థాయి ప్రమాణాలు కల విద్యాసంస్థల్లో హిందీ మాధ్యమంలోనే విద్యాబోధన ఉండాలని హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించడంపై కేటీఆర్ మండిపడ్డారు. కేవలం 40 శాతం ప్రజలు మాత్రమే మాట్లాడే హిందీ భాషను బలవంతంగా దేశం మొత్తానికి అంటకట్టడం దుర్మార్గం అన్నారు. భారత రాజ్యాంగం ఏ భాషకు అధికారిక హోదా ఇవ్వలేదని, రాజభాషా అని హిందీకి పట్టం కట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 22 భాషలను అధికారిక భాషలుగా మాత్రమే మన రాజ్యాంగం గుర్తించిందన్న కేటీఆర్, మోడీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్దమన్నారు.

ఇవాళ ప్రపంచ స్థాయి సంస్థలు, కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహించడానికి, మల్టీనేషనల్ కంపెనీల్లో మన యువత మెజార్టీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియంలో చదవడమే కారణమన్నారు. గ్లోబలైజేషన్ జమానాలో మిగతా ప్రపంచంతో మనం కనెక్ట్, కమ్యూనికేట్ అవ్వడానికి ఇంగ్లీష్ తో మాత్రమే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అయితే మోడీ ప్రభుత్వం హిందీ భాషకు అనవసర ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని తిరోగమన స్థితిలోకి వేగంగా తీసుకుపోతుందని కేటీఆర్ విమర్శించారు. అన్ని స్థాయిల్లో హిందీ భాషను కచ్చితం చేయాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ విధానాలతో ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మధ్య తీవ్రమైన ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతాయని కేటీఆర్ తెలిపారు. అన్ని భాషలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలన్న భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ హిందీ భాషను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని ప్రధాని మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు. వేంటనే అమిత్ షా సారద్యంలోని కమీటి ఇచ్చిన నివేదికను పక్కనపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నియామక పరీక్షలు హిందీ, ఆంగ్ల భాషలోనే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీ లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కాకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ నిర్ణయం కాలరాస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటిని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని డిమాండ్ చేస్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు.

కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య ఉంటుందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఇంగ్లీష్, హిందీలకే ప్రాధాన్యత ఇచ్చి తన చిత్తశుద్దిలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేవలం హిందీ, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్లతో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇది కేవలం 12 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదన్న కేటీఆర్, మాతృ భాషలో చదువుకున్న కోట్లాది మంది ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని భవిష్యత్తులోనూ అన్ని ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్నా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న తెలుగు రాష్ట్రాల యువకుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ అన్నారు.

ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గతంలో కేసీఆర్ విజ్ఞప్తి చేయడాన్ని గుర్తు చేశారు. 2020 నవంబర్ 18న నాడు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేఖ కూడా రాసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటిదాకా నోటిఫికేషన్లు వేయని మోడీ ప్రభుత్వం, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను హిందీ, ఇంగ్లీష్ లో నిర్వహిస్తూ మాతృభాషలో చదువుకున్న కోట్లాది మంది ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుందని మండిపడ్డారు. ఆర్టికల్ 345 ప్రకారం అధికారిక భాష అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, హిందీని బలవంతంగా రుద్దాలనుకోవడం భారత రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి విరుద్దమని కేటీఆర్ స్పష్టం చేశారు.

అఖిల భారత సర్వీసు పరీక్షలను మాతృభాషలో నిర్వహించవల్సిందే

ఢిల్లీలో ఉండే కొంతమంది బ్యూరోక్రాట్లు, నేతలు ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి వలసవాద, ఆధిపత్య భావజాలాన్ని మోస్తున్నారనడానికి సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశ్నపత్రాలన్నీ ఇంగ్లీష్, హిందీలోనే ఉండడమే సాక్ష్యమని విమర్శించారు. అఖిల భారత సర్వీసు పరీక్షలను అధిక శాతం ఇంగ్లీష్‌, హిందీల్లోనే నిర్వహించడం వల్ల మాతృభాషల్లో చదువుకుని ఆయా అంశాల మీద మంచి పట్టున్న అభ్యర్థులు నష్టపోతున్నారని కేటీఆర్ చెప్పారు. సివిల్స్ ప్రిలిమ్స్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి. ఇంటర్వ్యూలో అనువాదకుల అవసరం లేకుండా ఆయా భాషలు తెలిసిన అధికారులతోనే ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 20 కు పైగా ఉద్యోగ నియామక సంస్థలున్నాయన్న కేటీఆర్, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ పరీక్షలకు ఏటా లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారని చెప్పారు. అఖిల భారత స్థాయి ఉద్యోగాలకు యూపీఎస్సీ నిర్వహించే 16కు పైగా నియామక పరీక్షలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటాయన్నారు.

2017-2020 మధ్య యూపీఎస్సీ పరీక్షలకు దాదాపు 90 లక్షల మంది, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు కోటీ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్న కేటీఆర్, ప్రాంతీయ భాషల్లోనూ ఆయా పరీక్షలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మంది పోటీ పడేవారన్నారు. జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు సమాన, న్యాయమైన అవకాశాలు దక్కాలంటే అర్హత పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ప్రధానమంత్రి మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2014 ముందు వరకు ప్రాంతీయ భాషల్లో బ్యాంకు నియామక పరీక్ష రాసే అవకాశం ఉండేదని, కాని ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీల్లోనే నిర్వహిస్తుండడంతో ప్రాంతీయ భాషలో చదువుకున్న స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదన్నారు. బ్యాంకు నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండేళ్ల క్రితం ఇచ్చిన హామి “జుమ్లా” తప్ప మరొకటి కాదని కేటీఆర్ విమర్శించారు.

40% మంది మాత్రమే మాట్లాడే హిందీని దేశ ప్రజలపై బలవంతంగా రద్దడం సబబుకాదు..

దేశంలోని చాలా రాష్ట్రాలలో విద్యార్థులు తమ మాతృభాషాలోనే విద్య అభ్యసిస్తున్నారని, ఇంగ్లిష్, హిందీ భాషలను కేవలం ఒక అంశంగా మాత్రమే చదువుతున్నారని కేటీఆర్ తెలిపారు. తాము పొందిన జ్ఞానం, భావనలు ఇతర భాషలలో అనువదించుకొని, ఆ పదజాలాన్ని అవగాహన చేసుకొని పరీక్షలలో పోటి పడి ఉద్యోగం సాధించడం అంత సులువుకాదన్నారు. భారత జనాభాలో 40% మంది మాత్రమే మాట్లాడే హిందీ భాషని మెజార్టీ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. సివిల్స్, రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ తో పాటు నెట్‌, జనరల్‌ స్టడీస్‌ పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో రాసేందుకు అవకాశం కల్పించే విషయమై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేరళ సీఎం సైతం ప్రధానికి లేఖ..

దేశంలోని అన్ని టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విద్యాసంస్థల్లో హిందీ మీడియంను ప్రధాన బోధన భాషగా ప్రవేశ పెట్టడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినయని విజయన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర సర్వీసులతోపాటు, ఐఐటీ, ఐఐఎంలతో సహా పలు విద్యాసంస్థల్లో హిందీ మీడియం తప్పనిసరి చేయాలన్న కేంద్రం వైకరిని తప్పుబట్టారు. భారతదేశం వంటి భిన్న సంస్కృతులున్న దేశంలో భిన్న భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో ఒకే భాషను దేశ భాషగా గుర్తించి, యూనివర్సల్‌ భాషైన ఇంగ్లిష్‌ను ఐచ్చికంగా పేర్కొనడం సమంజసం కాదని తన లేఖలో పేర్కొన్నారు. దేశ యువతకు ఉద్యోగావకాశాలు పరిమితంగా ఉన్నాయని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సమాజానికి ఏ మాత్రం మేలు చేయని ఇటువంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. మాతృభాషతోపాటు ఇతర భాషలను నేర్చుకునేలా ప్రోత్సహించాలి గానీ, ఇలా బలవంతంగా రుద్దితే యువతరం భయాందోళనలకు గురౌతుందని తన లేఖలో సీఎం పినయని విజయన్‌ పేర్కొన్నారు. కేరళ, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలు కూడా విద్యాసంస్థల్లో హిందీ మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ఈ విషయమై పునరాలోచిస్తుందో లేదా గతంలో మాదిరి ఏక పక్షంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి..!