
హైదరాబాద్, ఆగస్ట్ 7: రాష్ట్ర విద్యార్ధులకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ ముగింపు వేడుకలు ఆగస్టు 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రంగం, పోతురాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌లో పేర్కొన్నప్పటికీ, అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.
ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం కావడంతో ఇప్పటికే పాఠశాలలకు సాధారణ సెలవులుగా ఇవి ఉన్నాయి. వీటికి బోనాల సెలవు కూడా కలిస్తే విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. మూడు రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో చాలా కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు, మరికొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు తెలంగాణలోని విద్యాసంస్థలకు ఈ ఆగస్టు నెలలో మొత్తం 11 రోజుల సెలవులు రానున్నాయి. ఇందులో 5 ఆదివారాలు, 3 సాధారణ ప్రభుత్వ సెలవులు, 3 ఐచ్ఛిక (ఆప్షనల్) సెలవులు ఉన్నాయి.
ఈ మూడు తేదీలను తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవులుగా నోటిఫై చేసింది. అయితే ఆగస్టు 10 బోనాల సెలవుపై అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే తుది స్పష్టత రానుంది.