‘NEET UG దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు’.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

నీట్‌-యూజీ దరఖాస్తులో కేటగిరీ వివరాలను తప్పుగా నమోదు చేసిన ఆరుగురు విద్యార్థులకు మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాము ఓబీసీ అయినప్పటికీ పొరపాటున జనరల్‌ కేటగిరీని ఎంపిక చేసుకున్నామని, దాన్ని మార్చేందుకు అనుమతించాలని విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దరఖాస్తుల సవరణకు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా ఫలితాల తర్వాత మార్పులు కోరడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది..

NEET UG దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Madras High Court Dismisses Plea by Six NEET Aspirants

Updated on: Nov 08, 2026 | 7:32 AM

చెన్నై, నవంబర్ 8: నీట్‌-యూజీ (NEET UG) పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో పొరపాట్లు చేసిన విద్యార్థులకు మద్రాస్‌ హైకోర్టు కీలక సందేశం ఇచ్చింది. దరఖాస్తులో తప్పుగా ఎంపిక చేసిన కేటగిరీని ఫలితాలు వచ్చిన తర్వాత మార్చాలని కోరుతూ కోర్టులో సానుభూతి ఆశించకూడదని స్పష్టం చేసింది. పరీక్ష నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత తప్పిదాల ఆధారంగా ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేమని పేర్కొంది. అసలేం జరిగింది?

2024లో నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఆరుగురు విద్యార్థులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఓబీసీ (OBC) కేటగిరీకి చెందినవారమైనప్పటికీ, దరఖాస్తు సమయంలో పొరపాటున జనరల్‌ కేటగిరీని ఎంపిక చేసుకున్నామని పిటిషన్‌లో తెలిపారు. ఈ తప్పును సరిదిద్ది తమను ఓబీసీ కేటగిరీగా పరిగణించాలని, వైద్య విద్య ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.ఎం. సుబ్రమణియన్‌, జస్టిస్‌ రాజేష్‌ వివేకానందన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేటగిరీ మార్పు సాధారణ తప్పు కాదు

విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న సామాజిక వర్గాన్ని మార్చాలని కోరడాన్ని సాధారణ పొరపాటుగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షలో ఇలాంటి మార్పులకు అనుమతిస్తే పరీక్షా విధానం, ర్యాంకుల జాబితాల విశ్వసనీయతపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత తప్పులను సరిదిద్దుకునేందుకు రెండు అవకాశాలు కల్పిస్తారని గుర్తుచేసింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఫలితాలు వెలువడిన తర్వాత కేటగిరీ మార్చాలని కోరడం సమంజసం కాదని స్పష్టం చేసింది. నీట్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు సంబంధించిన నిబంధనలు ప్రతి అభ్యర్థికీ సమానంగా వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది. పరీక్షా నిబంధనలను హైకోర్టు తన ఆదేశాలతో సవరించలేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తుచేసింది. కొంతమంది విద్యార్థుల పట్ల సానుభూతితో నిబంధనలను ఉల్లంఘిస్తే, వాటిని సక్రమంగా పాటించిన ఇతర అభ్యర్థుల హక్కులకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించింది.

వ్యక్తిగత పొరపాట్ల కారణంగా పరీక్షా నిబంధనల్లో మినహాయింపులు కోరడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసిన మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం.. ఆరుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్‌-యూజీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, విద్యార్హతలు వంటి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దరఖాస్తులో తప్పులు ఉంటే సవరణకు ఇచ్చే గడువులోనే వాటిని సరిచేసుకోవాలి. చివరి దశలో మార్పులు కోరితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us