TGPSC నుంచి మరో నోటిఫికేషన్.. రూ. లక్షన్నర జీతంతో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో ఉద్యోగాలు
TGPSC Town Planning Assistant Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది..

హైదరాబాద్, జులై 10: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్త అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కమిషన్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవెల్ కేడర్‌లో 2 పోస్టులు, మల్టీ జోనల్ కేడర్‌లో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జూలై 15, 2026 నుండి ఆగస్టు 22, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉండే ప్రొఫార్మా ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయోపరిమితి జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు ఆకర్షణీయమైన వేతన స్కేలు లభిస్తుంది.
విద్యార్హతల విషయానికి వస్తే, దరఖాస్తుదారులు తప్పనిసరిగా బి.ప్లానింగ్ లేదా బి.టెక్ ప్లానింగ్ విద్యార్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కమిషన్ కార్యదర్శి పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్లానింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక మంచి సువర్ణావకాశం.
