సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. బాలికలకు కూడా అవకాశం!

చిన్నప్పటి నుంచే విద్యార్థులను త్రివిధ దళాల్లో అధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2027) నిర్వహించనున్నారు..

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. బాలికలకు కూడా అవకాశం!
AISSEE 2027 Notification

Updated on: Nov 09, 2026 | 8:06 AM

దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలు కనే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పిస్తోంది. చిన్నప్పటి నుంచే విద్యార్థులను త్రివిధ దళాల్లో అధికారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE-2027) నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు డిసెంబర్ 2, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాఠశాలలన్నీ సీబీఎస్ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు. ఇక్కడ చదివే విద్యార్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నేవీ అకాడమీ తదితర రక్షణ రంగ శిక్షణా సంస్థల్లో చేరేందుకు అవసరమైన పునాది కల్పిస్తారు.

ఆరో తరగతి ప్రవేశాలకు 2027 మార్చి 31 నాటికి విద్యార్థుల వయసు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. 2015 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. బాలికలకు కూడా ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక తొమ్మిదో తరగతి ప్రవేశాలకు 2027 మార్చి 31 నాటికి విద్యార్థుల వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బాలురు, బాలికలకు వయోపరిమితి నిబంధనలు ఒకే విధంగా ఉంటాయి. అయితే సీట్ల లభ్యతను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ పూర్తి చేసుకోవడం మంచిది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, రక్షణ రంగ సిబ్బంది పిల్లలు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), మాజీ సైనికుల పిల్లలు: రూ.850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: రూ.700 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

AISSEE-2027 పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో ఓఎంఆర్ (OMR) షీట్ ద్వారా నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ఆరో తరగతి పరీక్ష.. లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తం 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతి ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. తొమ్మిదో తరగతి పరీక్ష.. మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తం 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది.

పరీక్ష సమయం

  • ఆరో తరగతి: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (150 నిమిషాలు).
  • తొమ్మిదో తరగతి: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (180 నిమిషాలు).

ముఖ్యమైన తేదీలు ఇవే

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2026.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2026.
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు్‌కు చివరి తేదీ: డిసెంబర్ 3-6, 2026.
  • దరఖాస్తుల సవరణ తేదీలు: డిసెంబర్ 7-9, 2026
  • అడ్మిట్ కార్డుల విడుదల: జనవరి 25, 2027
  • ప్రవేశ పరీక్ష: జనవరి 31, 2027.

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us