ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ స్వైప్ చేస్తున్నారా? అయితే మీరు ఆర్థిక ప్రమాదంలో పడ్డట్టే.. సరైన అవగాహనతో వాడితే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు ఇచ్చే క్రెడిట్ కార్డు.. కొన్ని సందర్భాల్లో వాడితే మాత్రం అధిక వడ్డీలు, హిడెన్ ఛార్జీలతో జేబుకు భారీగా చిల్లు పెడుతుంది. క్రెడిట్ కార్డును పొరపాటున కూడా ఉపయోగించకూడని ఆ 7 సందర్భాలు గురించి తెలుసుకోండి.

ఈ 7 చోట్ల క్రెడిట్ కార్డును అస్సలు వాడొద్దు.. మీకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Where Not To Use Credit Card

Updated on: Aug 24, 2026 | 12:17 PM

నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు మన జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగమైంది. సరైన పద్ధతిలో వాడుకుంటే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లతో పాటు సిబిల్ స్కోర్‌ను సైతం పెంచుకోవచ్చు. కానీ ఒక్క తప్పుడు స్వైప్ మీ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తుంది. క్రెడిట్ కార్డుపై విధించే హిడెన్ ఛార్జీలు, అధిక వడ్డీలు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. అందుకే క్రెడిట్ కార్డును పొరపాటున కూడా ఉపయోగించకూడని 7 సందర్భాలు, ప్రదేశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం

క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బులు తీయడం అతిపెద్ద ఆర్థిక తప్పిదం. నగదు విత్‌డ్రా చేయగానే బ్యాంకులు 2.5 నుంచి 3శాతం వరకు క్యాష్ అడ్వాన్స్ ఫీజు వసూలు చేస్తాయి. దీనికి ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఉండదు. డబ్బులు డ్రా చేసిన నిమిషం నుంచే వార్షికంగా 16శాతం నుంచి ఏకంగా 42శాతం వరకు భారీ వడ్డీ అమలవుతుంది.

పెట్రోల్ బంకుల్లో..

పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరిపినప్పుడు బ్యాంకులు ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌తో పాటు జీఎస్టీని విధిస్తాయి. కొన్ని కార్డులకు సర్‌ఛార్జ్ మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో అదనపు భారం పడుతుంది. వీటికితోడు పెట్రోల్ బంకుల్లో కార్డ్ స్కిమ్మింగ్ మోసాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డిజిటల్ వ్యాలెట్లలో మనీ లోడ్ చేయడం

పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వ్యాలెట్లలోకి క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులను యాడ్ చేసుకుంటే బ్యాంకులు ప్రత్యేకంగా కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీని బాదుతున్నాయి. తరచూ ఇలా చేయడం వల్ల తెలియకుండానే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టికెట్ బుకింగ్

ఐఆర్‌టీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే 1 నుంచి 2శాతం వరకు పేమెంట్ గేట్‌వే ఛార్జీలు, దానిపై అదనపు ట్యాక్స్‌లు పడతాయి. ఈ అదనపు ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే నేరుగా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.

అన్‌సెక్యూర్డ్ – అనుమానాస్పద వెబ్‌సైట్లు

URLలో HTTPS సెక్యూర్ లాక్ గుర్తు లేని లేదా అనుమానాస్పదంగా కనిపించే వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డు వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమోదు చేయవద్దు. సైబర్ మోసగాళ్లు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా డేటాను చోరీ చేసి ఖాతాలోని నగదును కొల్లగొట్టే ప్రమాదం ఉంది.

కార్డ్ టు కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

ఒక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి మరొక క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను ఎంచుకోవడం తాత్కాలికంగా సులువుగా అనిపించినా.. బ్యాంకులు దీనిపై భారీ ప్రాసెసింగ్ ఫీజులతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి. ఇది మీ మొత్తం బకాయి భారాన్ని మరింత పెంచుతుంది.

ఇప్పటికే భారీ ఈఎంఐలు ఉన్నప్పుడు

మీకు ఇప్పటికే హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఇతర భారీ ఈఎంఐలు నడుస్తున్నట్లయితే.. క్రెడిట్ కార్డుతో కొత్త షాపింగ్‌లు చేయడం మానుకోవాలి. స్తోమతకు మించి క్రెడిట్ కార్డును వాడటం మిమ్మల్ని తీర్చలేని డెబ్ట్ ట్రాప్‌లోకి నెడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us