
Bank Locker Key: మన విలువైన ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా దాచుకోవడానికి బ్యాంకు లాకర్లు సరైన ప్రదేశంగా భావిస్తాం. అయితే, అనుకోకుండా బ్యాంకు లాకర్ తాళం చెవి పోగొట్టుకుంటే ఏం చేయాలి? బ్యాంకులు కొత్త తాళం ఇస్తాయా? లేక లాకర్‌ను పగలగొట్టాల్సి వస్తుందా? ఈ సందేహాలకు ఆర్బీఐ స్పష్టమైన నియమ నిబంధనలను నిర్దేశించింది. చాలా మంది లాకర్ హోల్డర్లకు ఈ ప్రక్రియ గురించి సరైన అవగాహన ఉండదు.
బ్యాంకు లాకర్‌కు రెండు వేర్వేరు తాళాలు ఉంటాయి. ఒకటి కస్టమర్ వద్ద ఉంటే, మరొకటి బ్యాంకు వద్ద భద్రంగా ఉంటుంది. ఈ రెండు తాళాలు ఒకేసారి ఉపయోగించినప్పుడు మాత్రమే లాకర్‌ను తెరవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా కస్టమర్ దగ్గర ఉండే తాళానికి ఎలాంటి డూప్లికేట్ కీ తయారుచేయడం సాధ్యం కాదు. ఇది లాకర్ల భద్రతను నిర్ధారిస్తుంది. అందుకే కస్టమర్ తాళం పోగొట్టుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి పొందడం లేదా సాధారణ పద్ధతిలో లాకర్‌ను తెరవడం కుదరదు.
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?
కస్టమర్ తన లాకర్ తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు, లాకర్‌ను తెరవడానికి ఉన్న ఏకైక మార్గం దానిని పగలగొట్టడమే. ఈ పనిని కేవలం బ్యాంకుచే ఆధీకృత టెక్నీషియన్ మాత్రమే చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం కస్టమర్ సమక్షంలోనే జరగాలి. లాకర్‌ను పగలగొట్టేటప్పుడు పక్క లాకర్లకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం బ్యాంకు బాధ్యత.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. లాకర్‌ను పగలగొట్టడానికి అయ్యే ఖర్చులన్నీ కస్టమరే భరించాలి. అంతేకాకుండా పాత లాకర్ స్థానంలో కొత్త లాకర్‌ను ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన కొత్త తాళం చెవిని అందించడం వరకు అయ్యే మొత్తం ఖర్చులు కూడా కస్టమర్‌దే అవుతాయి. ఈ ఖర్చులు లాకర్ పరిమాణం, బ్యాంకును బట్టి మారవచ్చు. బ్యాంకులు ఈ ఖర్చుల గురించి కస్టమర్‌కు ముందుగానే తెలియజేస్తాయి. లాకర్ కీని భద్రంగా ఉంచుకోవడం కస్టమర్ ప్రాథమిక బాధ్యత. లాకర్ తీసుకునే సమయంలోనే అగ్రిమెంట్ పత్రంపై సంతకం చేసేటప్పుడు బ్యాంక్ అధికారులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తారు.
ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
లాకర్ తాళం పోగొట్టుకున్న తర్వాత అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసినా, బ్యాంకులు లాకర్‌ను తెరవడంలో లేదా పగలగొట్టడంలో ఆలస్యం చేయకూడదని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కారణం లేకుండా వాయిదా వేయడం నిబంధనలకు విరుద్ధం. ఒకవేళ బ్యాంకులు ఇలా జాప్యం చేస్తే, కస్టమర్లు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను లేదా వినియోగదారుల కోర్టులను లేదా ఇతర న్యాయస్థానాలను ఆశ్రయించి పరిష్కారం పొందవచ్చు.
అందుకే మీకు బ్యాంకు లాకర్ ఉంటే దాని తాళాన్ని అత్యంత జాగ్రత్తగా భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. తాళం గురించి ఎక్కువ మందికి సమాచారం ఇవ్వకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. పొరపాటున తాళం పోగొట్టుకుంటే పైన పేర్కొన్న ప్రక్రియలను అనుసరించి మీ విలువైన వస్తువులను తిరిగి పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్ సాయం.. ఎందుకో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి