
తల దువ్వినప్పుడు రాలే వెంట్రుకలను వ్యర్థంగా భావించి పారేయడం లేదా చిన్న ప్లాస్టిక్ వస్తువులకు ఇచ్చేయడం మన ఇళ్లలో సర్వసాధారణం. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రాలిన జుట్టుకు ఉన్న విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ ఫ్యాషన్, కాస్మెటిక్ రంగాల్లో భారతీయ వెంట్రుకలకు నల్ల బంగారం అనే పేరుంది. నిరుపయోగం అనుకునే వ్యర్థాల వెనుక వందల కోట్ల అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యం నడుస్తోంది.
యూరప్, అమెరికా, చైనా వంటి అగ్రదేశాల బ్యూటీ ఇండస్ట్రీకి భారతీయ కేశాలే ప్రధాన ముడిసరుకు. దీనికి గల ముఖ్య కారణాలు..
రసాయన రహిత సహజత్వం: విదేశీ మహిళలతో పోలిస్తే భారతీయ స్త్రీలు జుట్టుకు కృత్రిమ రంగులు, బ్లీచింగ్స్ లేదా హానికరమైన కెమికల్ ట్రీట్‌మెంట్లను వాడటం చాలా అరుదు.
బలమైన ఆకృతి: కొబ్బరి నూనె, సహజ సంరక్షణ వల్ల ఇక్కడి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు దృఢంగా, మందంగా ఉంటుంది.
ఆలయాల వేలం: తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు భక్తితో సమర్పించే తలనీలాలను దేవస్థానాలు అధికారికంగా ఈ-వేలం వేసి ఏటా వందల కోట్ల రాబడిని ఆర్జిస్తున్నాయి.
చిరు వ్యాపారులు సేకరించిన చిక్కు జుట్టు నేరుగా ఎగుమతికి పనికిరాదు. ఇది అనేక దశల పరిశ్రమ ప్రక్రియల గుండా వెళుతుంది.
క్లీనింగ్ – శానిటైజేషన్: సేకరించిన ముడి జుట్టును చెన్నై, కోల్‌కతా వంటి కేంద్రాల్లోని ఫ్యాక్టరీలకు తరలించి, క్రిమినాశక ద్రావణాలు మరియు ప్రత్యేక షాంపూలతో శుద్ధి చేస్తారు.
చిక్కు తీయడం: యంత్రాలు, నిపుణుల సాయంతో చిక్కుబడ్డ వెంట్రుకలను విడదీసి స్ట్రెయిట్ చేస్తారు.
గ్రేడింగ్ – ప్యాకింగ్: పొడవు (8 అంగుళాల నుంచి 30 అంగుళాల వరకు), రంగు, మందాన్ని బట్టి వర్గీకరించి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్యాక్ చేస్తారు.
నార్మల్ రకం: కిలోకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు
మధ్యస్థ నాణ్యత: కిలోకు 25,000 నుంచి రూ.30,000 వరకు
ప్రీమియం వర్జిన్ హెయిర్ : కిలోకు రూ.50,000 నుంచి రూ.80,000 పైనే పలుకుతుంది.
ఈ జుట్టును వైద్యపరంగా జుట్టు కోల్పోయిన రోగులకు కస్టమ్ విగ్గులు తయారు చేయడానికి, అంతర్జాతీయ సెలబ్రిటీల హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియల కోసం ఉపయోగిస్తారు. చిన్న గిన్నెకు ఇచ్చేసే పిడికెడు వెంట్రుకలే విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెట్టే భారీ పరిశ్రమకు ఇంధనంగా మారుతున్నాయి..