Startups: దేశంలో స్టార్టప్‌ల జోరు.. ఉద్యోగాల కల్పనలో తగ్గేదేలే.!

|

Dec 09, 2024 | 5:54 PM

దేశంలోని యువత వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు. కొత్త ఆలోచనలతో సరికొత్త సంస్థలకు అంకురార్పణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో స్టార్టప్ ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

Startups: దేశంలో స్టార్టప్‌ల జోరు.. ఉద్యోగాల కల్పనలో తగ్గేదేలే.!
Startups
Follow us on

ఒక వ్యాపారానికి సంబంధించిన ముందు రూపమే స్టార్టప్ అని చెప్పవచ్చు. వీటికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా చాలా బాగుంది. దేశంలో గుర్తింపు పొందిన స్టార్టప్ లు దాదాపు 55 పరిశ్రమల్లో 16.6 లక్షల ఉద్యోగాలు అందించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (డీపీఐఐటీ) తెలిపిన వివరాల ప్రకారం.. స్టార్టప్ లు సాంకేతికతకు అతీతంగా పనిచేస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. వాటి సంఖ్యలో వేలల్లో కాదు, లక్షల్లో ఉండడం విశేషం. 2024 అక్టోబర్ 31 నాటికి అనేక ఉద్యోగాలు కల్పించాయి. ఐటీ సేవల్లో 2,04,119, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ లో 1,47,639, నిర్మాణ రంగంలో 88702, విద్యకు సంబంధించి 90,414, ఆహారం పానీయల రంగంలో 88,468, గ్రీన్ టెక్నాలజీలో 27,808, పునరుత్పాదక ఇంధనంలో 41,523, ప్రొఫెషనల్ సేవల్లో 94,060, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో 23,918, రోబోటిక్స్ రంగంలో 5,956 ఉద్యోగాలు అందించాయి.

కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 1న స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎన్నో స్టార్టప్ లకు అంకురార్పణ గా నిలిచింది. వాటికి పెట్టుబడులను సమీకరించడంలో కీలకంగా వ్యవహరించింది. 19 అంశాల యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తూ స్టార్టప్ ల వికాసానికి చేయూత అందిస్తోంది. వాటికి రాయితీల కల్పన, ప్రోత్సాహకాల పంపిణీ, పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమ వర్గాల సహకారం లభించేలా చర్యలు తీసుకుంటోంది. స్టార్టప్ ల ప్రగతి కోసం నిర్మాణాత్మక ఫ్రేమ్ వర్కును స్టార్టప్ ఇండియా చేపట్టింది. స్టార్టప్ ల కోసం ఫండ్స్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (సీజీఎస్ఎస్)ను అమలు చేస్తోంది. దేశంలోని స్టార్టప్ లకు ర్యాంకులు, నేషనల్ అవార్డులు అందజేస్తూ, ఇన్నోవేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సాహం అందిస్తోంది.

అలాగే మెట్రో నగరాల్లో స్టార్టప్ ఇండియా హబ్, భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ (భాస్కర్) వంటి డిజిటల్ ప్లాట్ ఫాంలు సహకరాన్ని అందిస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర స్టార్టప్ లో మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన స్టార్టప్ లకు మార్కెట్ సౌకర్యం, వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా జీ 20 సదస్సులో స్టార్టప్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూప్ వంటి కార్యక్రమాలు నిర్వహించింది. దీని దీని మంచి ప్రోత్సహకాలు లభిస్తాయనే ఆలోచనలో ఉంది. స్టార్టప్ ల పరిధిని విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఈశాన్య ప్రాంతంలో స్టార్టప్ మహాకుంబ్, ఏఎస్సీఈఎన్డీ వర్కుషాపులు నిర్వహిస్తోంది. వీటి ద్వారా అట్టడుగు స్థాయి ఆవిష్కరణలకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి