Share Market Muhurat Trading: ఇన్వెస్టర్లు ఎంతో సెంటిమెంట్‌గా భావించే ముహూర్త్ ట్రేడింగ్ లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల సూచీల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొత్త సంవత్ లాభాలతో మొదలైంది. మార్కెట్లకు కొత్త ఏడాదిగా భావించే దీపావళి రోజు జరిగే ముహూర్త్ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుంటారు. గంటపాటు నిర్వహించిన ఈ ముహూర్త్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 24,300 పాయింట్లపైన క్లోజ్ అయ్యింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ముహూర్త్ ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 635 పాయింట్ల లాభంతో దూసుకుపోయింది. అయితే ముహూర్త్ ట్రేడింగ్ ప్రారంభమైన కాసేటికి లాభాలు తగ్గాయి. చివరికి 335 పాయింట్ల లాభంతో 79,724.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 94.20 పాయింట్లు లాభపడి 24,300 పాయింట్లపైన క్లోజ్ అయ్యింది.
ముఖ్యంగా ఆటో మొబైల్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఆటో కంపెనీలు నెలవారీ విక్రయ గణాంకాలను విడుదల చేసిన తర్వాత ఆటో స్టాక్‌లలో కొనుగోళ్లు కనిపించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 3% లాభపడగా, టాటా మోటార్స్ 1% కంటే ఎక్కువ లాభపడింది. మారుతీ సుజుకీ దాదాపు 0.6% లాభపడింది.
హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు కూడా లాభపడ్డాయి. ముహూర్త్ ట్రేడింగ్ ఎక్కువగా లాభాల్లోనే ముగుస్తుందన్న సెంటిమెంట్ ఈసారి కూడా కొనసాగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..