Personal loan: ఒకప్పుడు పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు సవాలక్ష సాకులు చెప్పే బ్యాంకులు ఇప్పుడు తమ తీరు మార్చుకుంటున్నాయి. మీకు పర్సనల్ లోన్ కావాలా అంటూ ఇప్పుడు వెంట పడుతున్న పరిస్థితి. తక్కువ రేటుకు అప్పులు ఇస్తామని పోటీపడి ప్రచారం చేస్తున్నాయి. హఠాత్తుగా జనాల మీద బ్యాంకులకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? కాస్త మంచి సిబిల్ స్కోర్ కలిగిన వారికి ఈ మధ్యలో రోజుకు కనీసం ఒకట్రెండు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్లు ఇస్తామని ఫోన్లు చేస్తున్న పరిస్థితి. తక్కువ వడ్డీ రేటని, ఎక్కువ వ్యవధి అందిస్తామని అనేక ఆఫర్లు కూడా అందిస్తున్నాయి. వాస్తవానికి కొవిడ్ కారణంగా కోలుకోలేనంతగా దెబ్బతిన్న బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. కొవిడ్ తర్వాతి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పు చోటుచేసుకుంటోందని చెప్తోంది. అయితే ఇందులో అనేక మతలబులున్నాయి. రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని RBI చెప్తోంది. అయితే అవన్నీ స్వల్ప వ్యవధి రుణాలే, ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుపై లోన్లు, గోల్డ్ లోన్లే.
పర్సనల్ లోన్లకు ప్రాధాన్యం..
RBI లెక్కల ప్రకారం ఫిబ్రవరి 2021లో 9.6 శాతంగా ఉన్న వ్యక్తిగత లోన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో 12.3 శాతానికి పెరిగాయి. రుణాలకు డిమాండ్ పెరుగుతోందనే విషయాన్ని ఈ డేటా స్పష్టం చేస్తోంది.సెప్టెంబర్ 2020లో 26 లక్షల కోట్లతో పర్సనల్ లోన్ కేటగిరీ ఉండగా, సెప్టెంబర్ 2021 నాటికి ఇది 12.3 శాతం పెరిగి 29.18 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ రుణాల్లో 46 మంది తమ కుటుంబ ఖర్చుల కోసం తీసుకున్నారు. గతంలో తీసుకున్న అప్పులు తీర్చేందుకు 27 శాతం మంది రుణాలు తీసుకోగా, ఉద్యోగాలు పోవడంతో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు 17 శాతం మంది రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలను బ్యాంకులు బాగా ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన రుణాలతో పోల్చితే పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అలాగే వాటిని తీర్చే గడువు కూడా తక్కువుంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్న బ్యాంకులు తమ సేవాభావాన్ని పూర్తిగా పక్కన పడేస్తున్నాయి. తక్కువ వ్యవధి ఎక్కువ వడ్డీ రేటుకు అవకాశం ఉండటంతో పర్సనల్ లోన్లకు ప్రయారిటీ ఇస్తున్నాయి. ఈ రుణాలను వసూలు చేసుకోవడం బ్యాంకులకు చాలా సులభమని చెప్పాలి. ఇచ్చే అన్ని రుణాలు తిరిగి తీసుకోవడం సాధ్యం కాకపోయినా భయపెట్టి పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకుంటున్నాయి.
ఇన్‌స్టంట్ మనీ కోసం..
కాగా బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. సెప్టెంబర్ 2020లో బంగారు నగలపై అప్పులు తీసుకున్న మొత్తం 40 వేల 086 కోట్లు కాగా, సెప్టెంబర్ 2021 నాటికి అది 63వేల 770 కోట్లకు పెరిగింది. అలాగే వినియోగ వస్తువుల కొనుగోలుపై తీసుకునే రుణాల్లో 40 శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది కాలంలో 10వేల 904 కోట్ల రూపాయల రుణాల పంపిణీ జరిగింది. ఈ డేటాను పరిశీలిస్తే ఇన్‌స్టంట్ మనీ కోసం జనాల నుంచి బాగా డిమాండ్ వస్తున్నట్టు కనిపిస్తోంది.కష్టాల నుంచి బయటపడేందుకు పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఉపయోగపడుతున్నాయనే భావన జనాల్లో ఉంది. అదే సమయంలో క్రెడిట్ కార్డులపై అప్పులూ పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు 40 శాతానికి పైగా వడ్డీ వసూలు చేస్తాయి. ఒక్క వాయిదా చెల్లించడంలో జాప్యం జరిగినా బ్యాంకులు విధించే వడ్డీ వాతలు దారుణంగా ఉంటాయి. ఇదే సమయంలో ఉదారంగా ఇచ్చే ఎడ్యుకేషనల్ లోన్లపై బ్యాంకులు కత్తెర వేస్తున్నాయి. విద్యార్థులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో కోత, జీతాల్లో కోత, కొవిడ్ మరణాల వంటి వాటి కారణంగా ఎడ్యుకేషనల్ లోన్లు తీర్చడం కష్ట సాధ్యమవుతుందనే భావనలో బ్యాంకులున్నాయి.
ఆ లోన్ల విషయంలో ఆచితూచి..
ఇక ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భవిష్యత్‌లో ఎడ్యుకేషన్ లోన్ పొందడం మరింత కష్టంగా మారుతుంది. ఉక్రెయిన్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లిన చాలా మంది విద్యార్థులు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారే. ఇప్పుడు వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో, వారు మళ్లీ అక్కడికి వెళ్లి తిరిగి చదవులు కొనసాగిస్తారా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నే. వాస్తవానికి ఎడ్యుకేషన్ లోన్లను చాలా బ్యాంకులు రిస్కీ వ్యవహారంగా భావిస్తాయి. ఈ లోన్లకు కొలెటరల్ సాధారణంగా ఉండదు. ఈ లోన్లు డీఫాల్ట్ అయితే వాటిని రికవరీ చేసుకోవడం బ్యాంకులకు చాలా కష్టం. అందుకునే ఆ రిస్క్‌ను అడ్జస్ట్ చేసుకునేందుకు ఇతర లోన్లకు బ్యాంకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అటు వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాల విషయంలోనూ బ్యాంకులు, ఆచితూచి స్పందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలనూ బ్యాంకులు రిస్కీగానే పరిగణిస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రుణాల పరిమితిని 3 లక్షలకు పరిమితం చేశాయి. అంటే 3 లక్షలకు పైబడి వ్యవసాయ రుణాలు తీసుకోవాలంటే ఒకింత కష్టసాధ్యమే. అయినప్పటికీ బ్యాంకుల డేటా ప్రకారం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. మరి బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇస్తున్నాయి కదా అని వ్యక్తిగత అవసరాలకు లేదా వివాహ వేడుకల కోసం అప్పులు తీసుకోవడమన్నది ఏ మాత్రం సరైన ఆలోచన కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రిటెయిల్ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అటు బ్యాంకులకూ RBI సూచిస్తోంది.
Also Read: Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..
IPL 2022: సురేష్ రైనాతో 5 నిమిషాల సమావేశం.. ఈ ఆటగాడి జీవితాన్నే మార్చేసింది..