జీవితంలో సక్సెస్ సాధించాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలు తప్పక తెలుసుకోవాల్సిందే..

విజయం అనేది అదృష్టం వల్ల రాదు.. మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని తన జీవితం ద్వారా నిరూపించిన మహనీయుడు రతన్ టాటా. అవమానాలను ఆయుధాలుగా మార్చుకుని శిఖరాలకు చేరుకున్న ఆయన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. కెరీర్‌లో, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే వారి కోసం రతన్ టాటా చెప్పిన 5 అద్భుతమైన సక్సెస్ మంత్రాల గురించి తెలుసుకోవాలి.

జీవితంలో సక్సెస్ సాధించాలంటే రతన్ టాటా చెప్పిన ఈ మాటలు తప్పక తెలుసుకోవాల్సిందే..
Ratan Tata Success Mantras
Image Credit source: AI Image

Updated on: Nov 12, 2026 | 3:05 PM

భారత పారిశ్రామిక రంగంలోనే కాకుండా, కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానుభావుడు రతన్ టాటా. వ్యాపారవేత్తగా ఎంత ఎత్తుకు ఎదిగినా, నిరాడంబరత, నిజాయితీ, మానవత్వం అనే పునాదులపైనే ఆయన తన సామ్రాజ్యాన్ని నిర్మించారు. కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు, ఆయన చెప్పిన ప్రతి మాట యువతకు, జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక భగవద్గీత లాంటిది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతున్నప్పుడు రతన్ టాటా చెప్పిన ఈ సక్సెస్ మంత్రాలు మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి.

నేను సరైన నిర్ణయాలు తీసుకోను.. తీసుకున్న నిర్ణయాలను సరైనవిగా మారుస్తాను

చాలామంది ఏదైనా పని మొదలుపెట్టే ముందే.. “ఇది సక్సెస్ అవుతుందో లేదో?, నా నిర్ణయం తప్పైతే ఎలా? అని భయపడుతుంటారు. కానీ రతన్ టాటా ఆలోచన దీనికి పూర్తిగా భిన్నం. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా వంద శాతం సరైనదని ముందే చెప్పలేం. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, దాన్ని విజయవంతం చేయడానికి మన పూర్తి శక్తిని, కష్టాన్ని పెడితే అదే సరైన నిర్ణయంగా మారుతుందని ఆయన బలంగా నమ్మేవారు.

వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవండి.. కానీ చాలా దూరం వెళ్లాలంటే అందరితో కలిసి నడవండి..

జీవితంలో లేదా కెరీర్‌లో చిన్నచిన్న విజయాలు సాధించడానికి మనం ఒక్కరమే కష్టపడితే సరిపోవచ్చు. కానీ ఒక గొప్ప లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలన్నా అందరి సహకారం ఎంతో అవసరం. టీమ్ వర్క్‌కు, తోటివారిని కలుపుకొని పోవడానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ ఒక్క మాట చెబుతుంది.

మీపై విసిరే రాళ్లను పోగు చేసుకోండి.. వాటితోనే ఒక గొప్ప కట్టడాన్ని నిర్మించండి

మనం ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు విమర్శలు రావడం సహజం. చాలామంది ఆ విమర్శలకు కుంగిపోయి మధ్యలోనే ఆగిపోతారు. 1999లో టాటా ఇండికా కారు విఫలమైనప్పుడు, అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ రతన్ టాటాను అవమానించింది. కానీ ఆయన కుంగిపోలేదు. ఆ అవమానాన్నే కసిగా మార్చుకుని, పదేళ్ల తర్వాత అదే ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను కొనుగోలు చేసి చరిత్ర సృష్టించారు.

ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు.. కానీ దాని సొంత తుప్పు మాత్రమే దాన్ని నాశనం చేస్తుంది

మనల్ని బయటి వ్యక్తులు ఎవరూ ఓడించలేరు. మనలో ఉండే అహంకారం, బద్ధకం, భయం, ప్రతికూల ఆలోచనలే మనల్ని పతనం చేస్తాయి. ఇనుముకు తుప్పు పట్టినట్లు, మన మనసుకు నెగెటివ్ ఆలోచనలు పట్టకుండా చూసుకుంటే మనల్ని ఎవరూ ఆపలేరని ఈ కొటేషన్ ద్వారా ఆయన అద్భుతంగా వివరించారు.

జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం..

జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటాం. కష్టాలు రాగానే నిరాశలో కూరుకుపోతాం. కానీ కష్టాలు, ఒడిదుడుకులు ఉన్నప్పుడే మనం బతికి ఉన్నామని అర్థం. ఆసుపత్రిలో ఈసీజీ గ్రాఫ్‌పై గీతలు పైకి, కిందకు కదులుతూ ఉంటేనే ప్రాణం ఉన్నట్టు.. ఒకవేళ అది నేరుగా మారితే ప్రాణం పోయినట్టే. కాబట్టి జీవితంలో వచ్చే కష్టాలను కూడా ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని ఆయన స్ఫూర్తినిచ్చారు.

డబ్బు, హోదా కంటే విలువలు, వ్యక్తిత్వమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని రతన్ టాటా తన జీవితం ద్వారా నిరూపించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన ఈ స్ఫూర్తిదాయక మాటలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us