
చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రధాన కారణం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్స్. ఇందులో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మ్యూచువల్ ఫండ్లలో నెలనెలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే విధంగా SIP(సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) రూపంలో నిర్దిష్ట కాల వ్యవధికి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందులో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మంత్లీ, 3, 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు. మీ ఆర్థిక స్థోమతను బట్టి పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. కాంపౌండింగ్ బెనిఫిట్‌తో దీర్ఘకాలంలో సంపద పెంచుకోవచ్చు.
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో మీ పెట్టుబడి డబ్బును పెంచుకోవచ్చు. కావాలనుకుంటే మధ్యలో ఆపొచ్చు. అలాగే ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో లాంగ్‌టర్మ్‌లో మీ డబ్బు పెంచుకోవడానికి ఒక అద్బుతమైన ఫార్ములా ఉంది. అదే 15x15x15 సిప్ ఫార్ములా. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
15x15x15 ఫార్ములా అంటే.. నెలకు రూ.15 వేల సిప్ పెట్టుబడితో మీకు 15 ఏళ్లలో 15 శాతం అంచనా వార్షిక రాబడితో కోటీశ్వరులు కావొచ్చన్నమాట. ఇక్కడ 15 ఏళ్లలో నెలకు రూ.15 వేల పెట్టుబడితో మీ పెట్టుబడి మొత్తం రూ.27 లక్షలుగా ఉంటుంది. కానీ 15 శాతం అంచనా రాబడితో మీకు వడ్డీ రూపంలోనే రూ.74,52,946 వస్తుంది. మొత్తంగా 15 ఏళ్లకు మీ చేతికి రూ.1,01,52,946 వస్తుంది. ఈ ఫార్ములాను మీ పెట్టుబడిలో అమలు చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇక్కడ దీర్ఘకాలంలో అంటే కనీసం 10 సంవత్సరాలు ఆపైన అయితేనే మంచి లాభాలు వస్తుంటాయి. కాంపౌండింగ్ బెనిఫిట్ పొందాలంటే దీర్ఘకాలం పెట్టుబడుల్ని కొనసాగించాలని చెబుతుంటారు. ఇంకా ఇక్కడ చాలా చిన్న వయసులోనే చేరడం ద్వారా రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో ఫండ్ సమకూరుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి