
రైళ్లల్లో ప్రస్తుతం రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్(RAC) కేటగిరీ ఉన్న విషయం తెలిసిందే. అంటే రిజర్వేషన్ కన్ఫార్మ్ అయినవారు తమ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఆ స్థానంలో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి బెర్త్ కేటాయింపు జరుగుతుంది. అయితే ఈ కేటగిరీ టికెట్ ఉన్నవారు మరో ప్రయాణికుడితో లోయర్ సైడ్ బెర్త్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకే బెర్త్‌ను ఇద్దరికి కేటాయిస్తారన్నమాట. ఈ టికెట్ ఉన్నవారు కేవలం కూర్చోని మాత్రమే ప్రయాణం చేయడానికి వీలుంటుంది. రాత్రి సమయంలో కూర్చోని ప్రయాణం చేయాలంటే కష్టతరంగా ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులు అసౌక్యానికి గురవుతూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్ఏసీ టికెట్లపై ఎప్పటినుంచో అనేక విమర్శలు వస్తున్నారు. ఆర్ఏసీ టికెట్లకు కూడా పూర్తి ఛార్జిని వసూలు చేయడం, ఇద్దరికి ఒకే బెర్త్ పంచడాన్ని గతంలో పార్లమెంటరీ ప్యానెల్ తప్పుబట్టింది. ఇది అన్యాయమైనదని, ఆర్ఏసీ టికెట్లకు పాక్షికంగా ఛార్జీని రీఫండ్ చేయాలని సిఫార్సు కూడా చేసింది.
ప్రయాణికులు, వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్ఏసీ టికెట్లను క్యాన్సిల్ చేయాలని రైల్వేశాఖ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యాలపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఆర్ఏసీ విధానాన్ని తొలగించే అంశాన్ని పరిశీలిస్తోన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకే బెర్త్‌ను ఇద్దరికి కేటాయించినప్పుడు పూర్తి ఛార్జీలు వసూలు చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇది తప్పనే అభిప్రాయలు కూడా ఎప్పటినుంచో వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఒకే సీటును ఒక పురుష ప్రయాణికుడు, ఒక మహిళా ప్రయాణికురాలికి కేటాయించినప్పుడు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఆర్ఏసీ వ్యవస్థ అన్యాయమైనదని, పూర్తి బెర్త్ లభించని పక్షంలో ప్రయాణికుడికి టికెట్ ఛార్జీలో పాక్షికంగా కొంతమొత్తం రీఫండ్ చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక నివేదికలో పబ్లిక్ అకౌంట్ కమిటీ సూచించింది.
ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం లేని రోజుల్లో ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఆ బెర్త్ ఖాళీగా ఉండేది. దీంతో అప్పట్లో ఆర్ఏసీ టికెట్లను ప్రవేశపెట్టారు. ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే వారి స్థానంలో మరొకరికి బెర్త్ కేటాయించేవారు. టికెట్ క్యాన్సిలేషన్లను ట్రాక్ చేయడానికి సరైన ఆన్ లైన్ వ్యవస్థ లేని సమయంలో తీసుకొచ్చిన ఈ విధానం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఎక్కువమంది టికెట్లను బుకింగ్ చేసుకుంటున్న తరుణంలో ఆర్ఏసీ వ్యవస్థ అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బదులుగా పూర్తి బెర్త్‌లు కేటాయించడం లేదా ఆర్ఏసీ టికెట్లకు పాక్షికంగా నగదు వాపసు చేయడం, బెర్త్‌ల కేటాయింపును మెరుగుపర్చడానికి ప్రత్నామ్నాయ అప్‌గ్రేడ్ ఏర్పాటు చేయడం లేదా ఆర్ఏసీ కోటాను పూర్తిగా రద్దు చేయడం వంటి రైల్వేశాఖ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. రైల్వేశాఖ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ప్రతిపాదన దశలో ఇది ఉన్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది రైల్వేశాఖ నుంచి ప్రకటన వస్తే కానీ తెలియదు.