ఇండియా సెమీ కండక్డర్ మిషన్ (ఐఎస్ఎం) కింద కేంద్రం రూ.76 వేల కోట్ల పెట్టుబడితో మొదటి దశ ను ప్రారంభించింది. దీనిలో పూర్తిస్థాయిలో విజయం సాధించింది. ఇప్పుడు రెండో దశను ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. సెమీ కండక్టర్లను సాధారణ భాషలో చిప్స్ అని వ్యవమరిస్తారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్.. ఇలా ప్రతి దానిలోనూ వీటిని ఉపయోగిస్తారు. కోవిడ్ మహమ్మరి సమయంలో ఏర్పడిన సంక్షోభంతో చిప్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే తైవాన్, జపాన్, సింగపూర్, చైనా తదితర దేశాల్లోనే వీటి తయారీ కేంద్రాలు ఉన్నాయి. దీంతో దేశంలోనే సెమీ కండక్టర్ల తయారు చేయడానికి 2022 డిసెంబర్ 15వ తేదీన ఐఎస్ఎంను ప్రారంభించారు. దేశంలో సెమీ కండక్టర్ల తయారీ, ప్యాకేజీ, డిజైన్ తదితర సామర్థ్యాలను పెంచడం ఐఎస్ఎం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడానికి పాలనా, ఆర్థిక ప్రతిపత్తి ఈ సంస్థకు ఉంది. ఈ విభాగంలో సలహా ఇవ్వడానికి ప్రపంచ నిపుణుల బోర్డు కూడా ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో దేశంలో ఐదు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో నాలుగు చిప్ ప్యాకేజింగ్ ప్లాంట్లు, ఒక చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉన్నాాయి. దాదాపు 36 నెలల కంటే తక్కువ సమయంలో వీటికి ఆమోదం లభించడం అభినందనీయం. ప్రస్తుతం ఇవన్నీ వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయి. వీటిలో 2025 నుంచి 2027 మధ్యలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఐఎస్ఎం మొదటి దశ విజయవంతగా ముగిసింది. ఇక రెండో దశలో మరికొన్నిలక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగనుంది. వాటిలో గ్లోబల్ సెమీ కండక్టర్ లీడర్లతో భాగస్వామ్యం పర్యావరణ రక్షణ, ముడిపదార్థాల అన్వేషణ తదితర అంశాలు ఉన్నాయి. సెమీ కండక్టర్ల తయారీ, అసెంబ్లీ యూనిట్ల ప్రతిపాదనలతో ఈ రంగంలోకి టాటా గ్రూప్, మురుగప్ప గ్రూప్, కేన్స్ సెమికాన్ వంటి సంస్థలు అడుగుపెట్టాయి.
ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మోహింద్రూ మాట్లాడుతూ తాము సెమీ కండక్టర్ల తయారీకి పునాదులు వేశామని, ఇది సుదీర్ఘ ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, సిజి పవర్, కేన్స్ టెక్నాలజీ తదితర సంస్థలు ఈ రంగంలోకి రావడం శుభపరిణామమన్నారు. ఇండియా ఇన్వెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈవో నివృత్తి రాయ్ మాట్లాడుతూ అంతర్జాతీయ, దేశీయ భాగస్వామ్యాలతో రూపొందించిన జాయింట్ వెంచర్ల వల్ల మూలధన వ్యయ అడ్డంకులను అధిగమించడం, సాంకేతికతను బదిలీ చేసుకోవడం సులభమవుతుందన్నారు. ఎన్విడియా, ఇంటెల్ వంటి ప్రపంచ దిగ్గజాలతో పోటీ పడాలంటే సాంకేతిక ఆవిష్కరణలతో పాటు బలమైన మౌలిక వసతులు, అమ్మకాలు, బ్రాండింగ్ చాలా అవసరమని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి