UPI Payments: ఒకే ఖాతా.. రెండు యూపీఐలు.. ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..

ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది డెలిగేట్ పేమెంట్స్. ఒక యూపీఐ అకౌంట్ ను ఒకరు కంటే ఎక్కువ మంది వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అంటే ఒక ప్రైమరీ యూజర్ ద్వారా థర్డ్ పార్టీ గా మరొకరు యూపీఐ పేమెంట్లు చేయొచ్చన్న మాట.

UPI Payments: ఒకే ఖాతా.. రెండు యూపీఐలు.. ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..
Upi Delegated Payments
Follow us

|

Updated on: Aug 09, 2024 | 4:22 PM

డిజిటల్ ఇండియా నినాదంలో భాగంగా మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) సేవలు విస్తృతమయ్యాయి. యూపీఐ ఆధారిత లావాదేవీలు మారుమూల గ్రామాల్లో కూడా అధికంగానే జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 50 కోట్ల లావాదేవీలు ఒక రోజుకు జరుగుతున్నాయి. ఈ పరిధిని మరింత విస్తరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది డెలిగేట్ పేమెంట్స్. ఒక యూపీఐ అకౌంట్ ను ఒకరు కంటే ఎక్కువ మంది వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అంటే ఒక ప్రైమరీ యూజర్ ద్వారా థర్డ్ పార్టీ గా మరొకరు యూపీఐ పేమెంట్లు చేయొచ్చన్న మాట. అదే సమయంలో యూపీఐ ట్యాక్స్ పేమెంట్ల పరిధిని కూడా రూ. 1లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ పెంచింది. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డెలిగేటెడ్ పేమెంట్స్ విధానం..

యూపీఐ పేమెంట్లు మరింత ప్రజాకర్షకంగా తీర్చేదిద్దే క్రమంలో ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం డెలిగేటెడ్ పేమెంట్స్. ఇది ఒక కుటుంబంలో సభ్యులు ఒకే యూపీఐతో పలువురు లావాదేవీలు జరిపే వీలు కల్పిస్తుంది. అంటే ఒక యూపీఐ వినియోగదారు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్ధేశిత పరమితి వరకూ యూపీఐ పేమెంట్స్ చేసేందుకు మరో వ్యక్తికి అధికారమివ్వవచ్చు. బ్యాంకు ఖాతా లేని వారు, పిల్లలు ఈ విధానం వల్ల తల్లిదండ్రుల యూపీఐ ఖాతాల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ప్రకటించాల్సి ఉంటుంది.

పరిమితి పెంపు..

ఆర్బీఐ యూపీఐ పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రూ. లక్ష లిమిట్ ను రూ. 5లక్షల వరకూ పెంచింది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నును సైతం యూపీఐ ద్వారా చెల్లించేందుకు వీలవుతుంది. అదే విధంగా చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. చెక్ క్లియరెన్స్ కోసం ఇప్పటి వరకూ ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్(సీటీఎస్) బ్యాచ్ ప్రాసెసింగ్ విధానం స్థానంలో ఆన్ రియలైజేషన్ సెటిల్ మెంట్ విధానంలో చెక్కులను క్లియర్ చేస్తారు. దీంతో చాలా తక్కువ గంటల్లోనే చెక్కులు క్లియర్ అయిపోతాయి. అలాగే నకిలీ రుణ యాప్ ల నివారణకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..