మొన్నటిదాకా భగ్గుమన్న బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా గోల్డ్‌రేట్లలో తగ్గుదలే కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర.. 6 వేల 825 రూపాయలుగా ఉంది. అయితే ఈ ఉపశమనం కొన్ని రోజులే అంటున్నారు..ఎక్స్‌పర్ట్స్.
వడ్డీరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్
గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న చర్చకు తెరదించుతూ.. వడ్డీ రేట్లను తగ్గించింది అమెరికా ఫెడ్ రిజర్వ్. ప్రస్తుతం 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్..ఈ ఏడాది చివరిలోగా మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. పడిపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి ఫెడ్ రిజర్వ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడ్ రేట్లు తగ్గడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. కొవిడ్ సంక్షోభం తర్వాత కూడా ఇదే తొలి వడ్డీ రేట్ల తగ్గుదల. దేశ ఆర్థిక వృద్ధితోపాటు జాబ్ మార్కెట్‌కు ఊతమిచ్చేలా..రానున్న సమీక్షల్లో వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు.
ఫెడ్ రిజర్వ్ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు
రెండు నెలల్లో అమెరికా ఎన్నికలు ఉండడంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం కీలకంగా మారింది. బ్యాంకుల నుంచి లోన్ తీసుకునే వినియోగదారుల నుంచి..వ్యాపారస్తుల వరకు ప్రతి రంగానిపై దీని ప్రభావం ఉంటుంది. ఫెడ్ రిజర్వ్ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌లూ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో ఇన్వెస్టర్లు..ఒక్కసారిగా పసిడి పెట్టుబడులపై దృష్టి పెట్టారు. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 22 డాలర్లు ఎగబాకి 2,600 డాలర్లకు చేరింది. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ ఆగస్టులో 10.06 బిలియన్ డాలర్లకు పెరిగిన దిగుమతిలు
బంగారమంటే భారతీయలకు లోహం కాదు..అదొక సెంటిమెంట్. పిసరంత బంగారమైనా ఇంట్లో ఉండాలనేది 140 కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్. దీంతో బంగారానికి డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని..15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఇక పండగ సీజన్ డిమాండ్‌తో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో దిగుమతులు డబుల్ అయ్యాయి. గతేడాది ఆగస్టులో 4.83 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా.. ఈ ఏడాది 10.06 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల దసరా, దీపావళి వంటి పండుగలు ఉండడంతో..రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు..వ్యాపారులు.
డిమాండ్ ఉన్నా ఉత్పత్తి మాత్రం లేదు
మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నా.. మనదగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలుస్తోంది. భారత్ మొత్తం దిగుమతుల్లో ఒక్క బంగారం వాటానే 5 శాతం. సెంట్రల్ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ వైఖరి కారణంగా..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆ ఎఫెక్ట్ భారత మార్కెట్‌ను కూడా తాకే అవకాశం ఉందంటున్నారు. దీంతో పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు పుత్తడి ప్రియులు.