ఎంత షాపింగ్ చేసినా ఇక బ్యాగులు మోసే పనిలేదు! రూ.149కే ‘షాపింగ్ అసిస్టెంట్’
ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్‌లో ‘క్యారీమెన్’ అనే స్టార్టప్ గంటకు రూ.149కే షాపింగ్ అసిస్టెంట్ సేవలను అందిస్తోంది. బరువైన బ్యాగులు మోయడం, క్యూలలో సహాయం చేయడం, పార్కింగ్ వరకు తోడుగా రావడం వంటి సేవలతో ఈ కొత్త వ్యాపార ఆలోచన వినియోగదారుల ఆదరణ పొందుతోంది.

ఢిల్లీలోని రద్దీ మార్కెట్లలో షాపింగ్ అంటే చాలా మందికి అలసటతో కూడిన అనుభవం. గంటల తరబడి నడవడం, బరువైన సంచులు మోసుకోవడం, జనసందోహంలో తిరగడం వల్ల కొనుగోలు ఆనందం తగ్గిపోతుంది. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, అలాగే అలసిపోయే భర్తలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీకి చెందిన CarryMen అనే స్టార్టప్ వినూత్న సేవలను ప్రారంభించింది. గంటకు కేవలం రూ.149కే ప్రత్యేక షాపింగ్ అసిస్టెంట్‌ను అందిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
మీరు షాపింగ్ చేయండి.. సామాను మోయడం మేము చూసుకుంటాం అనే నినాదంతో ఈ సంస్థ సేవలను అందిస్తోంది. వినియోగదారులు షాపింగ్ చేస్తుండగా, వారి వెంట శిక్షణ పొందిన సహాయకుడు ఉంటాడు. అతను షాపింగ్ బ్యాగులు మోయడమే కాకుండా, మార్కెట్‌లో సులభంగా తిరగడంలో సహాయం చేస్తాడు. అలాగే రెస్టారెంట్లు లేదా ఫుడ్ స్టాళ్ల వద్ద క్యూలలో నిలబడటం, పార్కింగ్ స్థలం లేదా మెట్రో స్టేషన్ వరకు సురక్షితంగా తీసుకెళ్లడం వంటి సేవలను కూడా అందిస్తారు. సంస్థ ప్రకారం వినియోగదారుల అవసరాలను బట్టి 2 గంటలు, 3 గంటలు, 4 గంటల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక సహాయకుడు గరిష్టంగా 12 కిలోల వరకు బరువును మోయగలడు. ఎక్కువ సామాను ఉంటే అదనపు సహాయకుడిని బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ స్టార్టప్‌ను ప్రారంభించిన యువకులు చిన్నప్పటి నుంచే ఢిల్లీలోని రద్దీ మార్కెట్లలో ఎదురయ్యే ఇబ్బందులను గమనించారని చెబుతున్నారు. ముఖ్యంగా బరువైన సంచులు మోస్తూ కుటుంబ సభ్యులు అలసిపోవడం వారిని ఈ ఆలోచన వైపు మళ్లించింది. రోజువారీ సమస్యను వ్యాపార అవకాశంగా మార్చి ఈ సేవను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవ ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రారంభించిన కొద్ది కాలంలోనే మంచి స్పందన రావడంతో, త్వరలో చాందినీ చౌక్ వంటి ఇతర ప్రముఖ మార్కెట్లకు కూడా సేవలను విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో, భవిష్యత్తులో ఇది ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
