
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం చేయడం రైతులకు పెద్ద సవాలే.. ప్రస్తుతం ఎల్‌నీనో ఎఫెక్ట్ కారణంగా నీటి లభ్యత తగ్గి చాలా మంది రైతులు పంటలు వేయడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా సాగునీటి సౌకర్యం లేని రైతులు ఏ పంట సాగు చేయాలని తెలియక కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగలిగే పంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి పంటల్లో శనగ సాగు చాలా ముఖ్యమైనది. ఈ పంటకు పెద్దగా నీరు అవసరం లేదు.. కేవలం నేలలోని తేమ ఆధారంగానే ఈ పంటను సాగు చేయవచ్చు.. నీటి కొరత ఉన్న ప్రాంతాల రైతులు ఈ పంట చాలా బాగా ఉపయోగపడుతుంది.
శనగ పంటను ప్రధానంగా ఖరీఫ్ సీజన్ తర్వాత సాగు చేస్తారు. ముఖ్యంగా మొక్కజొన్న వంటి పంటలను కోసిన వెంటనే పొలంలో ఉన్న నేల తేమను ఉపయోగించుకుని శనగ విత్తుకోవచ్చు. నీటిపారుదల సౌకర్యం లేని రైతులు కూడా వర్షాధారంగా ఈ పంటను సాగు చేయవచ్చు. శనగ పంటకు ప్రత్యేకంగా ఎక్కువ నీరు అవసరం ఉండదు. నేలలోని తేమ, ఉదయం వేళల్లో పడే మంచు కూడా పంట ఎదుగుదలకు కొంతవరకు తోడ్పడతాయని రైతులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకత కారణంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో శనగ సాగు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.
ఏ నేలల్లో సాగు చేస్తే మంచి దిగుబడి?
శనగ పంట ప్రధానంగా నల్లరేగడి నేలల్లో మంచి దిగుబడిని ఇస్తుంది. ఎర్ర నేలల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని రైతులు చెబుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీటి సౌకర్యం అందుబాటులో ఉండి, పూత దశకు ముందు ఒక తడి ఇస్తే దిగుబడి మరో రెండు క్వింటాళ్ల వరకు పెరిగే అవకాశం ఉందని అనుభవజ్ఞులైన రైతులు పేర్కొంటున్నారు.
ఓ రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నీటి సౌకర్యం లేకుండా సాగు చేస్తే ఎకరానికి సుమారు 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే పూత దశకు ముందు ఒక తడి ఇస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు. ఇక ఎకరా శనగ సాగుకు సుమారు 45 నుంచి 50 కిలోల విత్తనం అవసరమవుతుంది.
తక్కువ పెట్టుబడితో సాగు..
శనగ పంట సాగులో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. విత్తనం వేసే సమయంలోనే భూమికి అవసరమైన ఎరువులు అందిస్తారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు తడి ఇచ్చినప్పుడు అవసరాన్ని బట్టి అదనంగా ఎరువులు వేస్తారు. అయితే ఈ పంటకు ప్రధానంగా పచ్చపురుగు ఆశించే ప్రమాదం ఉంటుంది. దీని నివారణకు లార్విన్, కొరాజెన్ , పొక్లీన్ వంటి మందులను ఉపయోగిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.