ముంబైకి చెందిన సురేష్ డైరీ వ్యాపారం చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం రిలయన్స్ జియో తన ప్లాట్‌లో మొబైల్ టవర్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నట్లు అతనికి కాల్ వచ్చింది. టవర్ ఇన్‌స్టాల్ చేసుకున్నందుకు గానూ అతని భూమికి 25 లక్షల రూపాయలు అద్దె అడ్వాన్స్‌గా, అలాగే నెలవారీగా 40 వేల రూపాయలు అద్దెగా చెల్లిస్తామని చెప్పారు. సురేష్ ఆ ఆఫర్‌ను ఇష్టపడ్డాడు. అగ్రిమెంట్ కోసం వారు అడిగారని అతని ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను పంచుకున్నాడు. ఆ తరువాత అతనికి కాల్ చేసిన వారు TRAI స్టాంప్‌తో ఉన్న అగ్రిమెంట్ లెటర్‌ను సురేష్ కు పంపించారు. దానిలో 25 లక్షల రూపాయల అడ్వాన్స్‌పై 1% TDS చెల్లించాలని ఉంది. దీంతో సురేష్ 25,000 రూపాయలు డిపాజిట్ కూడా చేశాడు. ఆ తర్వాత వారు చెప్పిన విధంగా మెసేజ్‌లో వచ్చిన ఓటీపీని షేర్ చేశాడు. బ్యాంక్ ఎకౌంట్ లోకి 25 లక్షలు వచ్చి చేరుతాయని చెప్పారు. కానీ.. 25 లక్షల మాట దేవుడెరుగు.. అతని ఎకౌంట్ లో ఉన్న 60 వేల రూపాయలు మాయం అయిపోయాయి. మీకు విషయం అర్ధం అయిందా? అత్యాశకు పోయిన సురేష్ సైబర్ మోసగాళ్ళ వలకు చిక్కి 60 వేల రూపాయలు సమర్పించుకున్నాడు. ఈ స్టోరీలో టవర్.. TRAI.. ఎగ్రిమెంట్ అంతా మోసమే.
మొబైల్ టవర్ల ఏర్పాటు పేరుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మోసం వ్యాపారం సాగుతోంది. ఇల్లు, ప్లాట్ లేదా ఫీల్డ్ పైకప్పుపై మొబైల్ టవర్‌ని ఇన్‌స్టాల్ చేయడం స్థిర ఆదాయానికి అవకాశాన్నిస్తుంది. కానీ టెలికాం రంగానికి చెందిన ఏ కంపెనీ కూడా నేరుగా ప్రజలకు కాల్ చేయదు. ఈ విషయంలో TRAI ప్రమేయం అసలు ఉండదు.
మొబైల్ టవర్ల ఏర్పాటుకు టెండర్ల మంజూరు వంటి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఈ మధ్యకాలంలో టవర్ల ఏర్పాటు పేరుతో మోసం కేసులు వేగంగా పెరిగాయి. అటువంటి మోసాలను నిరోధించడానికి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఎటువంటి ఎన్‌ఓసి జారీ చేయలేదని టెలికాం రెగ్యులేటర్ TRAI ద్వారా చాలా సార్లు SMS లు ప్రజలకు పంపిస్తూనే ఉన్నారు. ఎవరైనా మోసగాడు నకిలీ లేఖతో మీ వద్దకు వస్తే, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ అలాగే స్థానిక పోలీసులకు తెలియజేయామని ఆ మెసేజెస్ లో స్పష్టం చేస్తున్నారు.
ప్రజలు పొందే మోసపూరిత సందేశాలలో చాలా సార్లు లింక్స్ కూడా ఉంటాయి. ఇటువంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫారమ్‌ను పూరించమని వారిని అడుగుతారు. పొరపాటున అలాంటి లింక్‌లపై క్లిక్ చేయకండి. మీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకండి ఎవరైనా డబ్బు అడిగితే, పూర్తిగా రిజెక్ట్ చేయండి.
ఎవరైనా ఫోన్ ద్వారా పెద్ద ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, అది ఖచ్చితంగా మోసపూరిత కాల్ అవుతుంది అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాక్టర్ దివ్య తన్వర్ చెబుతున్నారు. ప్రభుత్వం, బ్యాంక్ లేదా మరే ఇతర కంపెనీతో అనుబంధించిన వ్యక్తి మిమ్మల్ని పాస్‌వర్డ్- OTP కోసం ఎప్పుడూ అడగరు. ఇలా ఎవరైనా అడిగితే మోసం చేస్తున్నారని అర్ధం చేసుకోండి. ఎటువంటి పరిస్థితిలోనూ ఆ వివరాలు ఇవ్వకండి.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలా మోసపోయిన సురేష్ వంటి వారు ఏమి చేయాలి? ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత సైబర్ సెల్‌లో కేసు నమోదు చేయాలి. అతను తన బ్యాంకుకు కూడా లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఇలాంటి సందర్భాల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం తక్కువే అయినప్పటికీ, ఫిర్యాదు చేయడం ద్వారా, ఏ ఖాతాలో లావాదేవీ జరిగిందో బ్యాంకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది దర్యాప్తులో పోలీసులకు సహాయపడుతుంది. అయితే, ఇటువంటి మోసాలను నివారించడానికి జాగ్రత్త అతిపెద్ద ఆయుధం అనే విషయాన్ని మర్చిపోవద్దు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి