
ఉద్యాన పంటల సాగుకు పెట్టింది పేరైన అనంతపురం జిల్లా రైతులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వినూత్న పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులతో అధిక ఆదాయం ఆర్జిస్తున్న ఇక్కడి రైతుల బాటలోనే, కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రమణ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రాయలసీమ ప్రాంతానికే సరికొత్తదైన అవకాడో పంటను రెండెకరాళ్లో పండిస్తూ.. ఆయన లక్షల సంపాదిస్తున్నారు.
రాయలసీమ రైతులు సాంప్రదాయేతర పంటల వైపు మొగ్గు చూపడం ఇదే మొదటిసారి కాదు. గతంలో డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్, ఖర్జూరం వంటి అరుదైన పంటలను ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు సాధించారు. ప్రస్తుతం మెకాడెమియా, అవకాడో వంటి కొత్త పంటలపై దృష్టి సారిస్తున్నారు. అయితే, ఒక కొత్త పంట స్థానిక వాతావరణానికి అనుకూలించి పూర్తిస్థాయి దిగుబడి ఇవ్వడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి, రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని, తగిన ఓపిక, అధ్యయనంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని నమ్ముకున్న రైతు రమణకు మంచి ఫలితం దక్కింది.
అయితే ఈ రైతు అవకాడో సాగు ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ పంట వేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన కర్ణాటకలోని తొంటికొప్ప ఐఐహెచ్ఆర్ (IIHR) శాస్త్రవేత్తలను సంప్రదించారు. అయితే, రాయలసీమ వాతావరణ పరిస్థితులకు ఈ పంట ఎంతవరకు అనుకూలిస్తుందో పూర్తి భరోసా వారు ఇవ్వలేకపోయారు. ప్రయోగాత్మకంగా కేవలం 5 మొక్కలు నాటి పరిశీలించాలని సూచించారు. కానీ, అంత సమయం వేచి ఉండలేక ఆ రైతు ఏకంగా 250 అవకాడో మొక్కలను నాటారు. కొత్త పంటల్లో సహజంగా జరిగే పరిణామాల రీత్యా మొదటి 3 సంవత్సరాలు ఆయనకు ఎటువంటి దిగుబడి రాలేదు.
కరవు నేలలో కాసుల పంట
తరచూ కరువు పరిస్థితులను ఎదుర్కొనే రాయలసీమ వాతావరణంలో అవకాడో వంటి పంటను సాగు చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఆయన పట్టుదల, శ్రమతో ఈ ప్రయోగం అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పొలంలో కాసిన అవకాడో కాయలు అద్భుతమైన నాణ్యత, పెద్ద పరిమాణంతో ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా బయట మార్కెట్‌లో లభించే చిన్న కాయలతో పోలిస్తే, ఇక్కడ ఒక్కో కాయ దాదాపు 800 గ్రాముల వరకు బరువు తూగుతుండటం విశేషం.
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే సామర్థ్యం ఈ పంటకు ఉండటంతో, రమణ సాధించిన ఈ విజయం అనంతపురం జిల్లాలోని ఇతర రైతులకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కొత్త పంటల సాగులో ఆచరణాత్మక పరిశీలన, సాహసం, ఓపిక ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో రమణ అనుభవం స్పష్టం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.