అప్పులు, అభివృద్ధి. ఈ రెండింటిపై తెలంగాణలో లెక్కల పంచాయితీ జరుగుతోంది. తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయని అంటోంది బీజేపీ. తెచ్చిన అప్పులను కరెక్ట్‌గా ఖర్చు చేశాం కాబట్టే అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని చెబుతోంది టీఆర్‌ఎస్. అయినా బంగ్లాదేశ్ కన్నా ఘోరంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి సంగతేంటని కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. తెలంగాణలో అప్పులు, అభివృద్ధిపై విమర్శలకు పదునుపెట్టింది బీజేపీ. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో ప్రతి చోటా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కేంద్రం నిధులు ఇస్తున్నా సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నది ఆయన వాదన. పైగా అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారని, త్వరలోనే దివాళా తీయడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు కిషన్‌రెడ్డి. కేంద్రమంత్రి విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు సుదీర్ఘంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్థిక పరిస్థితులను వివరించారు. కేంద్రం కన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ ఉందని లెక్కలు చెప్పారు. ఏ రకంగా చూసినా తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. అసలు రాష్ట్రం నుంచి వెళుతున్న పన్నుల కన్నా కేంద్రం ఇస్తోంది చాలా చాలా తక్కువన్నది తెలంగాణ వాదన. పైగా కేంద్రం అదనంగా రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తోంది.