మన టైమ్ వచ్చేసింది భయ్యా..! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..

Kartika Purnima 2026: నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుదైన గ్రహాల కలయికలు ఏర్పడనున్నాయి. చంద్రుడికి బలం పెరగడంతో పాటు చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగాలు కూడా ప్రభావం చూపనున్నాయి. ఈ గ్రహాల అనుకూలతతో ఆరు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో అదృష్టం కలిసి రానుంది. మరి కార్తీక పౌర్ణమి నుంచి మహర్దశ ప్రారంభం కానున్న ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

మన టైమ్ వచ్చేసింది భయ్యా..! కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మహర్దశ..
Kartika Purnima 2026

Edited By:

Updated on: Nov 17, 2026 | 6:20 PM

చంద్రుడి ప్రభావం మనసు మీదా, వ్యక్తిగత జీవితాల మీదా ఉంటుంది. వృద్ధి చంద్రుడు, క్షీణ చంద్రుడిని బట్టి ఈ ప్రభావం మారుతూ ఉంటుంది. ఈ నెల (నవంబర్) 24న సంభవిస్తున్న కార్తీక పౌర్ణమి ప్రభావం ఈసారి మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రుడికి కేంద్ర స్థానమైన చతుర్థ స్థానంలో కుజ, గురువుల సంచారం వల్ల చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. పైగా చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఆ రోజున చంద్రుడికి మరింతగా బలం పెరుగుతోంది. దీనివల్ల వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి ఆ రోజు నుంచి మహర్దశ ప్రారంభం అవుతుంది.

వృషభం

ఈ రాశిలో పౌర్ణమి ఏర్పడడంతో పాటు, చంద్ర మంగళ, గజకేసరి యోగాలు కూడా కలుగుతున్నందు వల్ల ఆ రోజున వీరు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమం చేపట్టినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. శివార్చనతో వీరు కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. తప్పకుండా వీరి దశ తిరుగుతుంది. వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఉన్నత పదవుల్ని పొందుతారు. ఏ రంగంలో ఉన్నా మంచి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి.

కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛ స్థితిలో లాభ స్థానంలో సంచారం చేయడంతో పాటు, గురువుతో గజకేసరి యోగం, కుజుడితో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున ఈ రాశి వారు శివార్చన చేయడంతో పాటు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. దీనివల్ల తప్పకుండా ధనధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు.

ఇవి కూడా చదవండి

కన్య

కార్తీక పౌర్ణమి రోజున లాభాధిపతి చంద్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు పరమశివుడిని ధ్యానించడంతో పాటు, గణపతిని కూడా పూజించడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.

వృశ్చికం

కార్తీక పౌర్ణమినాడు సప్తమ స్థానంలో చంద్రుడికి బలం పెరగడం వల్ల, దశమ స్థానంలో ఉన్న కుజ, గురువులతో రెండు మహా యోగాలు కలుగుతున్నందువల్ల ఈ రాశివారు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ధ్యానించడంతో పాటు కుబేర స్తోత్రం పఠించడం మంచిది. వీరికి మహాభాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా కలుగుతుంది.

మకరం

పౌర్ణమినాడు ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుడు ఉచ్ఛ పట్టడం, కుజ, గురువులతో భాగ్య యోగాలు కలగడం ఈ రాశివారు శివార్చనతో పాటు, విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం చేయడం మంచిది. దీనివల్ల ఈ రాశివారికి కల్యాణ యోగం, సంతాన యోగం, ధన ధాన్య సమృద్ధి యోగం కలిగే అవకాశం ఉంది. అతి కొద్ది ప్రయత్నంతో అత్యంత సంపన్నులు కావడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి.

కుంభం

ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుడు బలోపేతుడవుతుండడంతో పాటు సప్తమంలో కుజ, గురువులతో యోగాలు ఏర్పడుతున్నందువల్ల, ఈ రాశివారు శివాభిషేకంతో పాటు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది. ఆ రోజు నుంచి వీరికి మహర్దశ ప్రారంభం అవుతుంది. అపర కుబేర యోగం, సంతాన యోగం కలుగుతాయి. ఆదాయం అంచనాల్ని మించుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. రాజయోగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు మటుమాయం అవుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us