AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన పరివర్తన యోగం.. వారికి సిరిసంపదలు, అధికార యోగాలు పట్టబోతున్నాయ్..!

జూన్ 2న గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో ప్రవేశించగా, చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయడం వల్ల అరుదైన పరివర్తన యోగం ఏర్పడుతోంది. జూన్ 2 నుంచి 4 వరకు కొనసాగనున్న ఈ శుభయోగం ప్రభావంతో మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలిగి ఆర్థికంగా, సామాజికంగా మంచి పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అరుదైన పరివర్తన యోగం.. వారికి సిరిసంపదలు, అధికార యోగాలు పట్టబోతున్నాయ్..!
Jupiter Moon Parivartana Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 27, 2026 | 6:58 PM

Share

జూన్ 2న కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛపడుతున్న గురువు మొదటి రోజునే కొన్ని రాశుల వారిని అందలాలు ఎక్కించడం జరుగుతోంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తుండగా, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం జరుగుతోంది. ఈ పరివర్తన యోగం 2, 3, 4 తేదీల వరకు కొనసాగుతుంది. ఈ గురు శిష్యుల మధ్య పరివర్తన వల్ల మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకు రాజయోగాలను, ధనయోగాలను ఇవ్వడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛస్థితిలో సంచారం ప్రారంభించిన గురువుకు, భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా దశ తిరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న ఉచ్ఛ గురువుతో సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు పరివర్తన చెంద డం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగు తుంది. ఉద్యోగంలో ఆశించిన ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  3. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు, చతుర్థ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. వారసత్వపు ఆస్తి లభిస్తుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు, రోగ, రుణ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి.
  4. తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడితో దశమ స్థానంలో ఉచ్ఛలో ఉన్న గురువుకు పరివర్తన జరగడం వల్ల సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న చంద్రుడితో భాగ్య స్థానంలో ఉన్న ఉచ్ఛ గురువుకు పరివర్తన జరగడం వల్ల రాజపూజ్యాలు, రాజయోగాలు కలుగుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
  6. మీనం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న చంద్రుడికి, పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుకు మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

Follow Us