ధనలక్ష్మి యోగం.. ఆ రాశులకు అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ఖాయం..!
Lucky Zodiac Signs: మే 29 నుంచి జూన్ 8 వరకు మిథున రాశిలో శుక్రుడు, బుధుడు కలయికతో ఏర్పడుతున్న ధనలక్ష్మి యోగం కొన్ని రాశుల వారికి ప్రత్యేక శుభఫలితాలను అందించనుంది. ఆదాయ వృద్ధి, ఆర్థిక లాభాలు, ఆస్తి వ్యవహారాలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు, గృహ-వాహన ప్రయత్నాల్లో విజయాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఈ కాలం అదృష్టాన్ని తీసుకురానుంది.

Luck And Wealth Astrology
ఈ నెల(మే) 29 నుంచి జూన్ 8 వరకు మిథున రాశిలో శుక్ర, బుధ గ్రహాల యుతి జరుగుతోంది. మిథున రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడాన్ని జ్యోతిషశాస్త్రంలో ధన లక్ష్మీ యోగంగా అభివర్ణించడం జరిగింది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టడానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండదు. ఏ ప్రయత్నాలు చేపట్టడానికైనా ఇది చాలా మంచి సమయం. ఆస్తి వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు, షేర్లు, వడ్డీ వ్యాపారాలు వంటివి బాగా కలిసి వస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ రెండు గ్రహాల యుతి వల్ల వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు బాగా అదృష్టవంతులు కాబోతున్నారు.
- వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు ధనాధిపతి బుధుడితో కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అత్యధికంగా ఫలితం లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలలో రికార్డులు సృష్టిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.
- మిథునం: పంచమాధిపతి శుక్రుడితో రాశ్యధిపతి బుధుడు ఇదే రాశిలో కలవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి కలిగే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. జీతభత్యాలు, రాబడి పెరుగుతాయి.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రుల యుతి వల్ల ఎక్కువగా లాభపడేది ఈ రాశివారే. దశమ, లాభాధిపతులు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు భాగ్యాదిపతి బుధుడిని కలవడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు దినదినాభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. షేర్ల వ్యాపారం బాగా లాభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ, శుక్రులు కలుస్తున్నందు వల్ల ఈ రాశివారికి తప్పకుండా మహా భాగ్య యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, శుక్రులు యుతి చెందడం వల్ల ఎటువంటి ఆదాయ వృద్ధి ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు, ధన లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు ఆశించిన స్థాయిలో జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
Follow Us