ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో క్రియేటివిటీ పేరుతో చాలా రకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని మనకు క్రియేటివిటీని పెంపొందించేలా ఉంటే.. మరికొన్ని ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సరిగ్గా యూట్యూబ్ చూసి తన క్రియేటివిటీకి పదునుపెట్టాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి చివరికి విగతజీవిగా తిరిగొచ్చాడు. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్
బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలేనికి చెందిన ముగ్గురు స్నేహితులు చెరువులో ఈతకు వెళ్ళారు. . పాలేరు జస్వంత్(18) డిగ్రీ ఫస్ట్‌ఇయర్ చదువుతున్నాడు. మణికంఠ ఇంటర్ సెకండియర్, రామరాజు డిప్లొమా చదువుతున్నారు. ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ప్రతిరోజు సాయంత్రం వేళ గ్రామంలోని చెరువుకు సమీపంలో వాలీబాల్ ఆడుకుంటారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం ఎప్పటిలాగానే కొంతసేపు వాలీబాల్ ఆడుకుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న తరుణంలో వారి మదిలో మెలిగిన ఓ భిన్న ఆలోచన ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసింది . ఖాళీ వాటర్ బాటిళ్ళను నడుముకు కట్టుకుని, ఈతకు దిగాలనే ఆలోచన తలెత్తడంతో తక్షణమే ఆచరణలోకి పెట్టారు. ఈ పరిస్థితుల్లో రెండు లీటర్ల వాటర్ బాటిళ్ళు 2, ఒక లీటర్ బాటిళ్ళు 2 చొప్పున నడుముకు కట్టుకుని నీటిలో దిగారు. ఆ సమయంలో జస్వంత్ కట్టుకున్న సీసాల తాడు ఊడిపోవడంతో లోతైన చెరువు నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
మిగిలిన ఇద్దరు స్నేహితులు ఒడ్డుకి చేరుకొని ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్థులు అందరూ అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జస్వంత్ కోసం గాలింపు చేపట్టారు. ఎక్కడా జాడ దొరక్కపోవడంతో చీరాల నుండి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి రంగంలోకి దించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో జాతీయ విపత్తు నిర్వహణ శాఖ వారికి సమాచారం అందించారు. జాతీయ విపత్తు సిబ్బంది రాకముందే అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల సమయంలో మృతదేహాన్ని కనిపెట్టి వెతికి తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన జస్వంత్ బంధువులు, తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. జస్వంత్ చీరాల భారతీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఎప్పుడూ స్నేహితులతో సరదాగా గడిపే జస్వంత్ ఓ చిన్న పొరపాటు కారణంగా మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..