AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఛీ.. ఛీ ఇదేం పాడుపని మాష్టారూ?.. స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌ వీరంగం.. ఏం చేస్తున్నాడో చూడండి!

ఇటీవల కాలంలో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే మతి తప్పి ప్రవర్తిస్తున్నారు. స్కూల్‌లో జీవిత పాఠాలు నేర్పించాల్సిందిపోయి, వారి ప్రవర్తనతో పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. ఒక హెడ్మాస్టర్‌ ఏకంగా స్కూల్‌లోనే మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించాడు. చివరకు ఉద్యోగం ఊద్యోగం ఊడగొట్టుకున్నాడు.

Watch Video: ఛీ.. ఛీ ఇదేం పాడుపని మాష్టారూ?.. స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌ వీరంగం.. ఏం చేస్తున్నాడో చూడండి!
Vizianagaram News
Gamidi Koteswara Rao
| Edited By: Anand T|

Updated on: Sep 18, 2025 | 7:30 PM

Share

విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ లో హెడ్మాస్టర్ వీరంగం సృష్టించాడు. కుంటినవలస జడ్పీ హైస్కూల్ లో హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న రామకృష్ణారావు గత కొన్ని నెలలుగా మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం సేవించి స్కూల్ కి వస్తూ ఉండేవాడు. అంతేకాకుండా స్కూల్ ఆవరణలోనే తోటి ఉపాధ్యాయుడితో కలిసి మద్యం సేవిస్తుంటాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ అతన్ని అడిగే ధైర్యం చేసేవారు కాదు. కానీ రోజురోజుకి విషయం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18 ఉదయం హెడ్మాస్టర్ రామకృష్ణారావు మద్యం మత్తులో తూలుతూ పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులు క్లాస్‌లో కూర్చుని ఉండగానే గట్టి గట్టిగా అరుస్తూ, డెస్క్‌లు తన్నుతూ వీరంగం సృష్టించాడు. పిల్లలు, టీచర్స్ ను బూతులు తిడుతూ అందరినీ భయపెట్టాడు. తోటి ఉపాధ్యాయులు భయంతో వెనక్కి తగ్గారు. విషయం తెలుసుకున్న విద్యా కమిటీ చైర్మన్ సత్యనారాయణ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో డిప్యూటీ డిఈవో మోహన్ రావు స్కూల్ లో విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా మీరు మద్యం తాగి స్కూల్‌కు ఎందుకు వస్తున్నారు? ఇది విద్యార్థులకు చెడు సందేశం ఇస్తుందని అడిగాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రామకృష్ణారావు సమాధానం ఇవ్వకుండా తోటి ఉపాధ్యాయుడు సూర్యారావు పై దాడి చేశాడు. వెంటనే పరిస్థితి గమనించిన తోటి ఉపాధ్యాయులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ఘటనతో పాఠశాల మొత్తం గందరగోళంగా మారింది. రామారావు నిత్యం పాఠశాల ఆవరణలోనే మద్యం సేవిస్తున్నాడని, స్టాఫ్ రూమ్‌లో బాటిల్స్ దాచుకుని తాగుతున్నాడని విచారణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్పారు. మద్యం మత్తులో పాఠాలు చెప్పుతున్న హెడ్మాస్టర్ ను చూసి, విద్యార్థులు కూడా చెడు అలవాట్లు నేర్చుకునే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులు తక్షణమే హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటి డిఇఓ విచారణ రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించాడు. హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని సిఫారసు చేశాడు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. విద్యా వ్యవస్థలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా, ఉపాధ్యాయులకు కఠిన నిబంధనలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఐక్యంగా నిలబడాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అంతా కోరుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.