తిరుపతి వ్యవసాయ కళాశాలలో పులి సంచారం కలకలం రేపుతున్నది. తెల్లవారుజామున ఓ పులి, రెండు పిల్లలు సంచరిస్తుండగా చూశామని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు కళాశాల పరిసరాలను పరిశీలించి పాదముద్రలు సేకరించారు. సంచరించేది పులేనా లేక వేరేదైనా జంతువా అని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలుపుతున్నారు. కాగా, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ ఎవరూ బయటకు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు. పులి సంచరిస్తున్నదన్న వార్త దావానంలా వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు.