Minister Peddireddy sensational comments : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మాటలు విని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు. అలా చేసిన వాళ్లని తమ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ధ్రువపత్రాలివ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవని పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆయన హెచ్చరించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘జిల్లా అధికారులు ఎన్నికల నిబంధనల్ని తప్పక పాటించాలంటూ అధికారులను ఎస్‌ఈసీ భయపెడుతున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. ఎస్ఈసీ తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టకూడదని నిబంధనల్లో ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవడం సరికాదన్న పెద్దిరెడ్డి.. కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవమైతే ఎస్‌ఈసీకి ఎందుకు ఇబ్బంది అంటూ వ్యాఖ్యానించారు. ఏమీ అనకుండానే తనతో పాటు బొత్స సత్యనారాయణపై గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారన్న పెద్దిరెడ్డి.. ఎస్‌ఈసీని గౌరవించాల్సిన అవసరం లేదన్నారు.