RTC Bus: ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!

| Edited By: Balaraju Goud

Dec 24, 2024 | 12:38 PM

బస్సు డిపోలో ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్, అధికారుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సు జాడ గుర్తించారు. అయితే, బస్సు ఇక్కడికి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

RTC Bus: ఆర్టీసీ డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టిన బస్సు.. తీరా కిలోమీటర్ల దూరంలో ప్రత్యక్షం..!
Apsrtc Bus
Follow us on

అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ ఎక్కేందుకు తెల్లవారుజామున డిపోకు వచ్చిన ఆ డ్రైవర్‌కు.. అక్కడ ఉండాల్సిన ఆర్టీసీ బస్సు కనిపించకుండాపోయింది. ఇటు అటు చూశాడు. కనిపించలేదు. డిపో అంతా వెతికాడు. జాడలేదు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసలు.. చివరకు కిలోమీటర్ల దూరంలో ఆ బస్సు ఉన్నట్లు గుర్తించారు. ఆరా తీసిన పోలీసులకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు అది. ప్రతిరోజు నర్సీపట్నం డిపో నుంచి తుని వరకు ప్రయాణిస్తుంది. ఆదివారం(డిసెంబర్ 22) రాత్రి విధులు పూర్తయ్యాక డ్రైవర్ బస్సును నర్సీపట్నం డిపోలో పార్క్ చేసిన డ్రైవర్ ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి క్లీనర్‌కు చెప్పి క్లీన్ చేయాలని తాళం ఇచ్చాడు. అర్ధరాత్రి వరకు బస్సును క్లీన్ చేసిన క్లీనర్.. తాళాలన్ని బస్సులోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే విధుల కోసం వచ్చిన మరో బస్సు డ్రైవర్.. బస్సు కోసం చూసేసరికి అక్కడ బస్సు కనిపించలేదు. డిపో అంతా వెతికాడు బస్సు డ్రైవర్. ఎక్కడా కనిపించకపోతే సరికి ఖంగుతున్నాడు. అధికారులతో పాటు బస్సు ఓనర్ కు కూడా సమాచారం అందించాడు.

మూడు ప్రత్యేక బృందాలతో..

బస్సు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెతకడం ప్రారంభించారు. మూడు బృందాలుగా గాలించారు. ఈలోగా బస్సు చింతపల్లి రోడ్ లో చింతలూరు, లోతుగడ్డ జంక్షన్ సమీపంలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. చింతపల్లి పోలీసులను నర్సీపట్నం పోలీసులు అలర్ట్ చేశారు. బస్సును స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు, ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సిఐ గోవిందరావు తెలిపారు.

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. ఈ బస్సును ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. అతడు గత కొంత కాలంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నాడు. బస్సును ఎందుకు తీసుకెళ్లావని ఆరా తీస్తే, పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. దీంతో అసలు విషయాన్ని రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నర్సీపట్నం పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..